SLBC | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టు కంపెనీ నిర్దాక్షిణ్యంతో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనుల్లో ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. అత్యంత ప్రమాదకరమైన ఎస్ఎల్బీసీ సొరంగంలో చేపట్టిన పనుల్లో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదంగా మారింది. టన్నెల్ పైకప్పు కూలడంతో ఆ ప్రాంతంలో చిక్కుకున్న వారి ఆచూకీ ఐదు రోజులైనా దొరకలేదు. గాలింపు, సహాయ చర్యలు కొనసాగుతున్నా ఎలాంటి పురోగతి లేదు. కార్మికులు ప్రాణాలతో బయటపడుతారన్న ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతున్నది. టన్నెల్ లోపలికి వెళ్లివచ్చిన సహాయ బృందాలు చెప్తున్న వివరాల ప్రకారం చూస్తే ఎలాంటి ఆశలు కనిపించడం లేదని అధికారులు చెప్తున్నారు. బురద, నీరు, మట్టి, రాళ్లతో టన్నెల్ ఎక్కడికక్కడ పూడుకుపోవడం, శిథిలాల తరలింపునకే నెలల సమయం పట్టే అవకాశముందని వెల్లడిస్తుండడంతో పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు.
ప్రమాదం జరిగిందిలా!
ఎస్ఎల్బీసీ సొరంగంలో 14వ కిలో మీటర్ పాయింట్ వద్ద శనివారం ఉదయం 8.20 గంటలకు ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, రాళ్లు వచ్చి టన్నెల్ బోర్ మిషన్పై పైకప్పు కూలింది. ఈ క్రమంలో టీబీఎం ముందు భాగంలో పనులు చేస్తున్న 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. 5 రోజులు గడిచినా ఇప్పటివరకు కార్మికుల అచూకీ, ఆనవాళ్లు లభించలేదు. టన్నెల్ ముందుభాగంలోనే కార్మికులు జీవించి ఉంటారనే ఆశలే తప్ప ఎక్కడ ఉన్నారనేది కచ్చితంగా తెలియని పరిస్థితి నెలకొంది. కార్మికులు బ్రతికే ఉన్నారని చెప్పేందుకు ఒక్క సంకేతం కూడా కనబడడంలేదని రెస్క్యూ బృందాల అధికారులు చెప్తున్నారు.
చీకటి సొరంగం.. అత్యంత దుర్భరం
టన్నెల్ 150 మీటర్ల మేరకు కూలిపోయినట్టు సహాయ బృందాల అధికారులు చెప్తున్నారు. టీబీఎం వెనుక భాగం కూడా శిథిలాల కింద పూడుకుపోయిందని, ముందుభాగం కూడా బురద, నీరు, మట్టి, రాళ్లతో పూర్తిగా పూడుకుపోయి ఉంటుందని తెలిపారు. టీబీఎం తోకభాగాన్ని దాటుకుని రెస్క్యూ బృందాలు 100 మీటర్ల దగ్గర వరకు చేరుకోగలిగినా, మరో 40 మీటర్లు ముందుకు పోలేని పరిస్థితి ఉందని చెప్పారు. కార్మికులున్న ప్రాంతమంతా శిథిలాలతో నిండి ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు శిథిలాల కింద కాకుండా టీబీఎంలో ఖాళీ ప్రదేశంలో చిక్కుకుని ఉన్నారని భావించినా, 5 రోజులుగా నీరు, ఆహారం లేకుండా జీవించడం కష్టమేనని రెస్య్యూ బృందాల అధికారులు వివరిస్తున్నారు. వెరసి కార్మికులు జీవించి ఉండాలనే ఆశ తప్ప, వారు సజీవంగా ఉన్నారనేందుకు ఒక్క ఆధారమూ, అవకాశమూ లేకుండా పోయిందని నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆశలన్నీ సన్నగిల్లుతున్నాయని అంటున్నారు.
ముందుకుసాగని సహాయ చర్యలు
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సర్కారు చేపట్టిన సహాయ చర్యలు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్మైనర్స్, సింగరేణి తదితర రెస్క్యూ బృందాలు ఒకరి తర్వాత ఒకరు రావడం, సొరంగం లోపలి భీతావహ పరిస్థితులను చూసి నిస్సహాయంగా వెనుదిరగడమే కనిపిస్తున్నది. మంత్రులు, ఉన్నతాధికారులు హడావుడిగా రావడం, సొరంగంలోకి వెళ్లడం, బయటకు వచ్చి సమీక్షలు పెట్టడం, కార్మికులను రక్షించడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని ప్రకటించడం పరిపాటిగా మారింది. కానీ ఒక్క అడుగు కూడా ఇప్పటికీ ముందుకు పడలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బురద, నీరు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారనే తప్ప వాటి నివారణకు చిత్తశుద్ధితో కృషి చేయడంలేదని వివరిస్తున్నారు. బురద, నీరు తొలగింపు, ధ్వంసమైన టీబీఎంను కట్ చేసి తొలగించే పనులు చాలా నిదానంగా కొనసాగుతున్నాయని వాపోతున్నారు. సహాయ చర్యల తీరు చూస్తుంటే ఈ ప్రక్రియ నెలల తరబడి కొనసాగేలా ఉందని కార్మికులే అంటున్నారు. ఈ నేపథ్యంలో లోపల చిక్కుకున్న కార్మికులపై ఆశలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.