Rythu Runa Mafi | హైదరాబాద్, జూన్ 17(నమస్తే తెలంగాణ): ఇచ్చిన మాట ప్రకారం రైతులు అందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయడం, అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చుకునే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా? లేదా? అందరికీ ఒకేసారి రుణమాఫీ చేసి మాట నిలుపుకుంటుందా? కొందరికే వర్తింపజేసి చేతులెత్తేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన ఆగస్టు 15 గడువు దగ్గరకొస్తున్నప్పటికీ, నిధులు ఎలా సమకూర్చుకోవాలన్న అంశంలో ప్రభుత్వానికి స్పష్టత కొరవడింది. ఆదాయ మార్గాల అన్వేషణ బాధ్యతలను అధికారుల నెత్తిన పెట్టి, రోజుకోరకం లీకేజీలతో రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నది. దీంతో ఉరుకులు, పరుగులు పెడుతున్న అధికారులు ఏమీ చేయాలో, ఎలా చేయాలో తెలియక తలలుపట్టుకుంటున్నారు. రెండు నెలల్లో రుణమాఫీకి అవసరమైన నిధులు సమకూర్చడం అంత సులువు కాదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతున్నది. దీంతో ఏయే కారణాలతో ఎంతమంది రైతులకు కత్తెర వేస్తే ఎంత భారం తగ్గుతుందనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.
రుణమాఫీకి దాదాపు రూ.35 వేల కోట్లు అవసరమవుతాయని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పారు. ఈ మేరకు నిధులు సమకూర్చడం కాంగ్రెస్ ప్రభుత్వ సమర్థతకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణకు అవకాశం ఉన్న వివిధ ఆదాయ మార్గాలను పరిశీలిస్తున్నది. ముఖ్యంగా రుణమాఫీకి భూములను అమ్మడం, లేదా తాకట్టు పెట్టడం, లేదా అప్పులు చేయడం అనే అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రైతుల రుణాలను ఆ కార్పొరేషన్‌కు బదలాయించుకుంటామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అయితే ఇది అంత సులువు కాదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తంచేసినట్టు తెలిసింది.
ఒకేసారి ఇంత భారీ మొత్తం కార్పొరేషన్‌కు బదిలీ చేయించుకోవడం సాధ్యమయ్యే పని కాదని, ఇందుకు రిజర్వ్‌బ్యాంకు, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు చెప్పినట్టు సమాచారం. దీంతో భూములను అమ్మడం ద్వారా నిధులను సమాకూర్చుకోవాలనే ఆలోచన చేసినట్టు తెలిసింది. ఈ ప్రక్రియ ద్వారా నిధులు సమకూరేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నది. దీంతో భూముల అమ్మకం కన్నా.. బ్యాంకులకు తాకట్టు పెట్టడం ద్వారా తక్షణమే నిధులు తీసుకోవచ్చనే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఏయే భూములను తాకట్టు పెట్టొచ్చనే అంశంపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఇవేవీ కుదరని పక్షంలో రాష్ర్టానికి రావాల్సిన అప్పుల వాటాలో అత్యధికం ఇప్పుడే తీసుకొని ఆ నిధులను రుణమాఫీకి వినియోగించాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.52 వేల కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు రాష్ర్టానికి ఉన్నది. ఈ నేపథ్యంలో ఇందుకు అవసరమైన మేర రుణం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. రుణాన్ని మొత్తం ఒక్క రుణమాఫీకే వినియోగిస్తే ఆ తర్వాత మిగిలిన పథకాలకు నిధుల సమస్య తీవ్రమవుతుందని, పథకాలు కొనసాగించలేని పరిస్థితి తలెత్తుతుందని పలువురు అధికారులు సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏవిధంగా ముందుకెళ్లాలో తెలియక తికమక పడుతున్న ప్రభుత్వం రోజుకో లీకేజీ ఇస్తూ రైతుల్లో తీవ్ర గందరగోళం, భయాందోళనలు సృష్టిస్తున్నది. పైన పేర్కొన మార్గాలు ఎంతవరకు సాధ్యమవుతాయనే అంశంపై అధికారుల్లోనే సందేహాలు వ్యక్తమవుతుండటం కొసమెరుపు.
ఏది ఏమైనా సరే ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఆ దిశగా రోడ్‌మ్యాప్ సిద్ధం చేయలేదు. నిధుల సమీకరణపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. కటాఫ్ తేదీపైనా స్పష్టత ఇవ్వలేదు. అయితే రెండు తేదీలపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 2023 డిసెంబర్ 7వ తేదీ లేదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన రోజు, సోనియాగాంధీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 9వ తేదీలపై పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. నిధులు సమస్య తీవ్రమైతే, మళ్లీ ఏమైనా కుంటి సాకులు చెప్పి రుణమాఫీని వాయిదా వేస్తుందా? అనే చర్చ కూడా జరుగుతున్నది.
రైతులు అందరికీ రుణమాఫీ చేస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటే రూ.35 వేల కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయి. ఈ స్థాయిలో నిధులు సమకూర్చుకోవడం కష్టమని భావిస్తున్న నేపథ్యంలో అర్హుల సంఖ్యలో కోత పెట్టుందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే అత్యంత కఠినమైన నిబంధనలు గల పీఎం కిసాన్ పథకం నిబంధనలను అమలుచేయడం, రేషన్‌కార్డుతో లింక్ పెట్టడం లాంటివి రైతు రుణమాఫీకి వర్తింపచేయాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రుణమాఫీ భారం రూ.20 వేల కోట్ల నుంచి 23 వేల కోట్లకు తగ్గుతుందని అధికారులు లెక్కలేస్తున్నారు. అయితే, రుణమాఫీకి కూడా అడ్డదిడ్డమైన షరతులు పెట్టి, కోతలు విధిస్తే సగం మంది రైతులు అర్హత కోల్పోతారని, దీంతో వారిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుందని, రాజకీయంగా తీవ్ర నష్టాలు తప్పవనే ఆందోళన కొంతమంది కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నది.