హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): దేశ ప్రధాని మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రులు, వీవీఐపీలు, వీఐపీల రక్షణలో తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) ప్రధాన పాత్ర పోషిస్తున్నదని ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్ తెలిపారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో మంగళవారం కెనైన్స్ (పోలీస్ జాగిలాల) 25వ పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజీ మాట్లాడుతూ.. పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తి చేసుకున్న జాగిలాలు కేవలం నేర పరిశోధనలో పోలీసులకు నమ్మకమైన భాగస్వాములని కొనియాడారు.
వీటికి సమర్థంగా శిక్షణ ఇచ్చిన ట్రైనింగ్ అకాడమీ అధికారులను, సిబ్బందిని అభినందించారు. 2004లో ప్రారంభమైన ఈ శిక్షణ కేంద్రం నేడు దేశస్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన పోలీస్ శిక్షణ సంస్థగా గుర్తింపు పొందిందని ఐఎస్‌డబ్ల్యూ ఓఎస్డీ వీబీ కమలాసన్‌రెడ్డి చెప్పారు. 8 నెలల శిక్షణను పూర్తిచేసుకున్న 105 మంది హ్యాండ్లర్లు, 76 జాగిలాలు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పటివరకు ఈ అకాడమీ ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన 919 పోలీస్ జాగిలాలు, 1,310 మంది హ్యాండ్లర్లకు శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. 67వ, 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లలో తెలంగాణ పోలీస్ విభాగం వరుసగా ప్రథమ స్థానంలో నిలిచి బంగారు, వెండి పతకాలను కైవసం చేసుకోవడం ఇకడి శిక్షణ నాణ్యతకు నిదర్శనమని గుర్తుచేశారు.