ISRO Yuvika | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : బాల్యదశలోనే విద్యార్థులను సైన్స్, అంతరిక్ష సాంకేతిక రంగాలవైపు మళ్లించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషి చేస్తున్నది. ఈ ఏడాదికి యువ విజ్ఞాని కార్యక్రమం (యువిక ) కింద తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. తమ అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు ఏప్రిల్ 3లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ముందుగా విద్యార్థులకు ఆన్లైన్ క్విజ్ పోటీ నిర్వహిస్తారు. 8వ తరగతిలో సాధించిన మార్కులు, సైన్స్ ఫెయిర్‌లో, ఒలింపియాడ్ ర్యాంక్, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో భాగస్వామ్యం చేస్తారు. వారి నేపథ్యాన్ని బట్టి మార్కులను కేటాయించి, ఎంపిక ప్రక్రియ చేపడుతారు. హైదరాబాద్‌లో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ఇది రెండు వారాల కార్యక్రమం. స్పేస్ సైన్స్, స్పేస్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తారు. ప్రముఖ సైంటిస్ట్‌లు తమ స్వీయ అనుభవాన్ని విద్యార్థులకు వివరిస్తారు. కొన్ని ప్రయోగాలను చేసి చూపిస్తారు. ఇస్రోకు చెందిన ప్రయోగశాలల ప్రాధాన్యాన్ని వివరిస్తారు. శ్రీహరి కోటలోని సతీశ్ దావన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లి, రాకెట్ ప్రయోగాలపై శిక్షణ ఇస్తారు. ఎంపికైన విద్యార్థుల ఖర్చు మొత్తం ఇస్రో భరిస్తుంది. విద్యార్థుల వెంట తల్లి / తండ్రి / గార్డియన్ వెళ్లవచ్చు.
అంతరిక్ష రంగంపై ఆసక్తి కలిగించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. 9వ తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం. ఎంపికైన విద్యార్థులు ఇస్రో సంస్థల్లోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో చర్చించవచ్చు. ఆస్ట్రో ఫిజిక్స్, ఆస్ట్రో బయాలజీ, మెటీరియల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్‌లపై అవగాహన కల్పిస్తారు. శ్రీహరికోటలోని అంతరిక్ష నౌకాశ్రమాన్ని సందర్శించి ఇస్రో చైర్మన్‌తో సంభాషించే అవకాశం కలుగుతుంది.
– డాక్టర్ వీ గురునాధరావు, విద్యా పరిశోధకుడు, టీచర్
3 – 4- 2023 మొదటి విడత సెలెక్షన్ లిస్ట్
10-4- 2023 రెండో విడత సెలక్షన్ లిస్ట్
20-4-2023 ఎంపికైన వారు ఇస్రో
సెంటర్లలో రిపోర్ట్ చేయడం 14-5-2023
యువిక కార్యక్రమం 15-5-2023 నుంచి 26-5-23 వరకు