టెల్అవీవ్, డిసెంబర్ 13: హమాస్ మిలిటెంట్లను గాజాలోని టన్నెళ్లలోనే జలసమాధి చేసేందుకు ఇజ్రాయెల్ పథకం పన్నింది. ఇందులో భాగంగా సొరంగాల్లోకి సముద్రపు నీరు పంపించడాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రారంభించింది. దీని ద్వారా హమాన్ నెట్వర్క్ను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని అమెరికా అధికారులు వెల్లడించిన సమాచారాన్ని వాట్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. సొరంగాలను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సిద్ధం చేసిన ప్రణాళికల్లో మెడిటేరియన్ సముద్ర జలాలను వదలడం కూడా ఒకటి. అయితే సముద్ర జలాలను వదలడం వల్ల గాజాకు తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురు కావొచ్చని అమెరికా సర్కారు ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇప్పటికే సొరంగాల వద్ద అమర్చిన అయిదు పంపులకు అదనంగా మరో రెండు పంపులను అమర్చిన ఇజ్రాయెల్ సైన్యం జలాల విడుదలకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష నిర్వహించినట్టు సమాచారం.