ICET Convener | వరంగల్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఐసెట్ పరీక్షల నిర్వహణ నిధుల్లో గోల్మాల్ జరిగింది. పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులు దుర్వినియోగమయ్యాయి. కన్వీనర్ సొంత అకౌంట్లోకి నిధులను మళ్లించి ఆ తర్వాత ఖర్చు చేశారు. దీంతో ఐసెట్ నిర్వహణ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలో వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల కోసం పరీక్ష(సెట్)లను నిర్వహిస్తారు. ఒక్కో పరీక్షను ఒక్కో యూనివర్సిటీకి అప్పగించి ప్రత్యేకంగా కన్వీనర్‌ను నియమిస్తారు. ఐసెట్ పరీక్షల నిర్వహణ కొన్నేండ్లుగా కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నది. కామర్స్ డిపార్టుమెంట్‌లోని ప్రొఫెసర్ నరసింహాచారి కన్వీనర్‌గా ఉన్నారు. ఐసెట్-2024 నిర్వహణ
ఖర్చుల కోసం రూ.92.76 లక్షల ను స్టేట్ కౌన్సిల్ పంపించింది.
ఈ మొత్తాన్ని కేవలం ఆరు నెలల్లోనే ఖ ర్చు పెట్టినట్టు తెలిసింది. దీంతో ఐసెట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతం జీతాలు ఇవ్వలే ని పరిస్థితి నెలకొన్నది. ఆ నిధుల్లో రూ.29 లక్షలను విడతల వారీగా కన్వీనర్ సొంత అకౌంట్లలోకి బదిలీ చేసుకున్నారు. మరోవైపు ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు రూ.16 లక్షలను ఐసెట్ కన్వీనర్ అకౌంట్లో నుంచి సెల్ఫ్ చెక్కులను తీసుకొని డ్రా చేసుకున్నారు. ఆ డబ్బులను ఐసెట్ కాన్ఫిడెన్షియల్ విభాగం ఖర్చు కోసం వినియోగించాలి. యూనివర్సిటీ వాహ నం ఉపయోగించుకుంటున్న ఐసెట్ కన్వీనర్ నరసింహాచారి ట్రాన్స్‌పోర్టేషన్ పేరుతో అదనంగా ప్రతి నెల రూ.40 వేలు వాడుకున్నట్టు తెలిసింది. కామర్స్ విభాగంలోని ఐసెట్ ఆఫీసులో ఆఫీసు అసిస్టెంట్ రూ.11 లక్షల వరకు ఐసెట్ కన్వీనర్ అకౌంట్ నుంచి డ్రా చేసుకున్నట్టు తెలిసింది. అలాగే ఆఫీసు అసిస్టెంటు తన అకౌంట్‌కు రూ.86 వేలను మళ్లించి వాడుకున్నట్టు రికార్డుల్లో ఉంది. బిల్లులు సమర్పించకుండానే మరో రూ.12 లక్షలను ఐసెట్ నుంచి విత్ డ్రా చేసుకున్నట్టు తెలిసింది. అక్రమాలపై విచారణ జరపాలని అధికారులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.