హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ వచ్చే నెల 8వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. మొత్తం రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనుండగా, తుది విడత కౌన్సెలింగ్ వచ్చే నెల 23 నుంచి ప్రారంభంకానున్నది. ఐసెట్ అడ్మిషన్స్ కమిటీ సమావేశాన్ని మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమగ్రంగా చర్చించి, కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారుచేశారు. నవంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 29 నుంచి 31వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. అక్టోబర్ 28న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను https://tsicet. nic.inలో విడుదలచేస్తామని ప్రకటించారు. కౌన్సెలింగ్ సహా ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌ను ఈ నెల 27 నుంచే సంప్రదించవచ్చని నవీన్‌మిట్టల్ తెలిపారు.