హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆయుర్వేద, నేచురోపతికి మద్దతు అందించి ప్రోత్సహించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ముందుకు వచ్చింది. హైదరాబాద్కు చెందిన హీలింగ్ హస్త కంపెనీతో ఐఎస్బీ-సెంటర్ ఫర్ బిజినెస్ మార్కెట్ (సీబీఎం) మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సందర్భంగా ఐఎస్బీ-సీబీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ డీవీఆర్ శేషాద్రి మాట్లాడుతూ.. దుష్ప్రభావాలు కలుగకుండా చికిత్స అందించడంలో ఆయుర్వేద, నేచురోపతి ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొన్నారు. దీర్ఘకాలిక రోగాలు, లైఫ్ ైస్టెల్ డిజార్డర్స్ విషయంలో ఇవి బాగా పనిచేస్తాయని చెప్పారు. హీలింగ్ హస్త వ్యవస్థాపకుడు మస్తాన్యాదవ్ మాట్లాడుతూ.. ఐఎస్బీ-సీబీఎంతో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం తమ సంస్థకు గర్వకారణమని చెప్పారు.