హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో ఇచ్చిన గొర్రెలు ప్రతి 8 నెలలకోసారి ఈతకు వస్తున్నాయని, దీంతో వాటి సంఖ్య పెరిగిందని బీఆర్ఎస్ సభ్యుడు ఎగ్గె మల్లేశం చెప్పారు. అయితే గొర్రెలను మేపడానికి తగిన స్థలం అందుబాటులో లోదని అన్నారు. అడవుల్లో మేపుకుందామంటే కంచెలు అడ్డు పెడుతున్నారని, ఈ విషయంపై సర్కారు దృష్టి సారించాలని కోరారు. మరో బీఆర్ఎస్ సభ్యుడు శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల రోజు వారీ నిర్వహణకు ఆటంకం ఏర్పడుతున్నదని చెప్పారు. బండ ప్రకాశ్ మా ట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని దవాఖానల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూర రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న నియామకాలు భర్తీ చేయాలని సూచించారు.
టీటీడీలో మన లెటర్లు చెల్లడం లేదు
ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ.. టీటీడీ దర్శనం, అకామిడేషన్ కోసం ఇచ్చే లెటర్లను ఏపీ సర్కారు, టీటీడీ బోర్డు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ విషయంలో సర్కారు వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. రేషన్ డీలర్లకు చాలాకాలంగా కమిషన్లు ఇవ్వడం లేదని, వాటిని వెంటనే విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తాతా మధు మాట్లాడుతూ.. సత్తుపల్లిలో ఓపెన్‌కాస్టు వల్ల పర్యావరణం దెబ్బతిన్నదని, దాని వల్ల ఆ ప్రాంత ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, సత్తుపల్లిని పరిరక్షించాలని కోరా రు. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్లాస్టిక్ వా డకం బాగా పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.