DCP Ravinder | గీసుగొండ, డిసెంబర్ 23 : వేములవాడ రాజరాజేశ్వరస్వామి కోడెలను కబేళాలకు విక్రయించిన నిందితులు పోలీసులకు సహకరిచడంలేదని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ తెలిపారు. కోడెల విక్రయ నిందితులు మాదాసి రాంబాబు, మంద స్వామి, పసునూటి శ్యామ్ సుందర్‌ను కస్టడీలో రెండు రోజులుగా పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నించారు. సోమవారం వరంగల్ జిల్లా గీసుగొండ పోలీస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ విచారించారు. మనుగొండ, అనంతారం, చలపర్తి గ్రామాలకు చెందిన 33 మంది రైతుల ఆధార్‌కార్డు, భూమి పట్టాదారు పాసుపుస్తకాలను వేములవాడ రాజన్న గోశాల అధికారులకు చూపించి రెండు ధపాలుగా 66 కోడెలను తీసుకొచ్చామని, వాటిలో 28 కోడెలను అమ్ముకున్నామని నిందితులు తెలిపారు.
ఎవరికి అమ్మినామనే విషయం తెలుపలేదు. గీసుగొండ సీఐ మహేందర్ నిందితుడు మాదాసి రాంబాబును మనుగొండ గ్రామంలోని ఆయన ఇంటికి తీసుకెళ్లి రాజేశ్వరస్వార సొసైటీకి సంబంధించిన పత్రాలతో పాటు రైతుల ఆధార్‌కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, కోడెల వ్యవహారానికి సంబంధించిన పలు పత్రాలను సీజ్ చేశారు. కస్టడీలో తమను కొట్టినా, బెదిరించినా జడ్జి ముందు చెప్తామని పోలీసులకు ఎదురుతిరిగినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం అవసరమైతే మళ్లీ కోర్టు ద్వారా కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వరంగల్ జడ్జి ముందు హాజరు పరిచామని, వారి ఆదేశాలతో ఖమ్మం జైలుకు తరలించినట్టు సీఐ తెలిపారు.