Minister Ponnam Prabhakar | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): సమంత, నాగ చైతన్య విషయంలో మంత్రి కొండా సురేఖ్ చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా పరిగణించడంపై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘ఇంత రియాక్షన్ అవసరమా?’ అని ఆయన ప్రశ్నించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. నాగార్జున కుటుంబం కోరిక మేరకు మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారని తెలిపారు. అయినప్పటికీ సినీ నటుల నుంచి స్పందనలు ఆగలేదని అసహనం వ్యక్తంచేశారు. బలహీన వర్గానికి చెందిన మంత్రి సురేఖ ఒంటరి కాదని, ఆమెకు తామంతా అండగా ఉన్నామని అన్నారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఇంత దాడి ఎందుకు అని ప్రశ్నించారు. ఇష్యూని ఇంతటితో క్లోజ్ చేయాలన్నారు. ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని పీసీసీ అధ్యక్షుడు కూడా ఆదేశించినట్టు తెలిపారు.
ఇక మహిళల ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, డీఎస్సీ, ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని మంత్రి పొన్నం చెప్పారు. ఈ సంవత్సరం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే బతుకమ్మ చీరలకు రూ.150 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల సమస్యలపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించానని, వాళ్లు సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలోని 1029 గురుకులాల్లో చాలా వాటికి సొంత భవనాలు లేవని తెలిపారు. అద్దెకు తీసుకున్న హాస్టల్స్‌లోనూ సరైన వసతులు లేవని అన్నారు. రాష్ట్రంపై కేంద్రం మరోసారి వివక్ష చూపిందని విమర్శించారు. వర్షాలకు రూ.10 వేల కోట్ల నష్టం జరిగినట్టు నివేదిక ఇస్తే కేవలం రూ.400 కోట్లు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం లాభమని మండిపడ్డారు.