హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో 2021 బ్యాచ్ నర్సింగ్ ఆఫీసర్లు/స్టాఫ్‌నర్సుల క్రమబద్ధీకరణ అస్తవ్యస్తంగా సాగుతున్నది. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఈ ప్రక్రియ ఆరు నెలలుగా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికీ వందలాదిమంది ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారు. 2021లో ప్రభుత్వం 2,418 మంది స్టాఫ్ నర్సులను నియమించగా, నిరుడు ఆగస్టు నాటికి వారి రెండేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ ముగిసింది. తర్వాత వారి సర్వీస్ క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఒక్కరి ఉద్యోగం కూడా క్రమబద్ధీకరణ జరగలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహబూబ్‌నగర్ జిల్లాలో 27 మంది స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేశారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితం కావడంతో రెండు రోజులకే మరో 434 మందిని క్రమబద్ధీకరించారు. మిగతావారికి దఫదఫాలుగా క్రమబద్ధీకరణ చేస్తున్నారు. ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ డీపీహెచ్ విభాగంలో 600 మందికిపైగా ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
పారదర్శకంగా పదోన్నతులు చేపట్టండి
సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లకు త్వరగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ బుధవారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్‌ను కోరింది. ఈ మేరకు బుధవారం అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
నిబంధనలకు విరుద్ధంగా వైద్యుల నియామకం
డీఎంఈ, టీవీవీవీపీ పరిధిలోని స్పెషలిస్ట్ వైద్యులను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో నియమించడం సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం పేర్కొన్నది. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. టీజీజీడీఏ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి కార్యవర్గ సమావేశం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రభుత్వ వైద్యుల కోసం హైదరాబాద్‌లోని వైద్యభవన్ను పునరుద్ధరించి, త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్త్తామని రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నరహరి, డాక్టర్ లాలుప్రసాద్ రాథోడ్ తెలిపారు.