సుల్తాన్‌బజార్, జూన్ 1 : తెలంగాణ దేవాలయాల్లో వాయిద్య కళాకారుల భర్తీలో తెలంగాణకు చెందిన వారికి కాకుండా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వడమేంది? అని తెలంగాణ సన్నాయి కుల వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోమండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం తదితర దేవాలయాల్లో వాయిద్య కళాకారుల నియామకానికి ఇచ్చిన నోటిఫికేషన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొండగట్టు ఆలయం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్న కళాకారులకు కాకుండా, ఇతరుల నియామకాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు.
తెలంగాణ సన్నాయి కుల వాయిద్యకారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సన్నాయి వాయిద్యాలతో వినూత్న నిరసన తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని దేవాలయాల్లో తమ కులస్తులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కమిషనర్ కృష్ణప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ దేవాలయాల్లో వందల ఏండ్లుగా సన్నాయి వృత్తితో జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉద్యోగాల భర్తీకి డిప్లొమా సర్టిఫికెట్ కావాలని దేవాదాయశాఖ అధికారులు మెలికపెట్టి ఆంధ్రా కళాకారులను నియమించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. స్థానికత ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కోమండ్ల మహేంద ర్, మహాదేవుని శంకర్, దేవుని చంద్రమౌలి, మెట్టుపల్లి గంగారాం, సుధీర్, మధుకర్, రవి, రమేశ్, కోమాండ్ల సత్యనారాయణ, కొండగట్టు అనిల్, రవి, పెద్దసంఖ్యలో సన్నాయి వాయిద్య కళాకారులు పాల్గొన్నారు.