హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఈ రోజుల్లో సిమెంట్.. స్టీల్ వాడకుండా నిర్మాణాలు సాధ్యమేనా? అసాధ్యం అనుకుంటాం. కానీ, సంగారెడ్డి శివారులో వీటిని వాడకుండానే దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. లైమ్, బెల్లం, జ్యూట్, కరక్కాయ, మారేడు బిల్వం, ఇసుక, రాళ్లను వినియోగించి ఆలయ నిర్మాణం చేపడుతున్నారు.
మనమేదైనా బంగారు ఆభరణాన్ని ధరిస్తే కొంత కాలానికే మెరుగుపోతుంది. కానీ, యాదాద్రి దేవాలయ గోపురాలకు చేయించిన బంగారు తాపడం 50 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇస్రో, నాసా రాకెట్ల ప్రయోగానికి వినియోగించే నానో టెక్ గోల్డ్ డీపొజిషన్ (ఎన్‌టీజీడీ) టెక్నాలజీని యాదగిరిగుట్ట ఆలయ బంగారు తాపడంలో వినియోగించారు.
ఇలాంటివెన్నో ప్రత్యేకతలు తెలుసుకోవాలంటే ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలను చదవాల్సిందే. ఈ రెండు పుస్తకాల్లో తెలంగాణ అంశాలను పాఠంగా ప్రవేశపెట్టారు. సురవరం ప్రతాపరెడ్డి, పద్మశ్రీ తిమ్మక్క, కరోనా సమయంలో ఆపన్న హస్తం అందించిన స్ఫూర్తి ప్రదాత సేవాగుణాన్ని పాఠ్యాంశాలుగా చేర్చారు.
సాధారణంగా చరిత్ర పుస్తకాల్లో మాత్రమే సాంస్కృతిక వైభవాన్ని చాటుతారు. కానీ, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఇంగ్లిష్ పుస్తకాలను విభిన్నంగా తయారుచేశారు. తెలంగాణ పోరాటగాథలు మొదలుకొని.. మన సంస్కృతి, వారసత్వానికి ప్రతీకలైన వాటిని పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు. రీడింగ్ కాంప్రహెన్సివ్ పేరుతో ఒక్కో పుస్తకంలో 15 అంశాల గురించి ప్రస్తావించారు. స్వరాష్ట్ర వైభవాన్ని చాటేలా 60 వరకు అంశాలను సిలబస్‌లో చేర్చారు. ఇది వరకు జాతీయ, అంతర్జాతీయ అంశాలను మాత్రమే చేర్చేవారు. స్వరాష్ట్రంలో తెలంగాణ వైభవాన్ని చాటేలా అంశాలను పొందుపర్చారు. ఆయా అంశాలపై పరీక్షల్లో ప్రశ్నలిస్తుండగా, రీడింగ్ కాంప్రహెన్సివ్కు 8 మార్కులు కేటాయిస్తున్నారు. గత ఏడాది ఫస్టియర్‌కు కొత్త పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది కొత్తగా సెకండియర్ పుస్తకాన్ని ముద్రించారు. మరో వారం రోజుల్లో ఆ పుస్తకాలు విద్యార్థుల చేతికి అందుతాయి.