హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ): కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లపై చేతులెత్తేసినట్టేనా? అంటే అధికారవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పత్తి రైతులకు ప్రైస్ డెఫిసియెన్సీ పేమెంట్ సీం (పీడీపీఎస్- ధరల వ్యత్యాసం చెల్లింపు పథకం)ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తుండటంతో దీనిపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పీడీపీఎస్ విధానంలో రైతులు ప్రైవేటు వ్యాపారులకే పత్తిని విక్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ వారు ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు కొనుగోలుచేస్తే, ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సచివాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
పీడీపీఎస్ విధానంలో కలిగే లాభ నష్టాలను అంచనా వేసి, నివేదిక తయారుచేయాలని ఈ సందర్భంగా ఆయన మారెటింగ్ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. పత్తి కొనుగోళ్లలో కేంద్రం ఎంఎస్పీ స్థానంలో పీడీపీఎస్ పద్ధతిని ప్రవేశపెట్టాలని చూస్తున్నదని, రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాను పైలట్ జిల్లాగా ఎంచుకున్నదని మంత్రి తెలిపారు. ఈ విషయంపై ఈ నెల 19న నీతి ఆయోగ్ సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నదని, అంతకు ముందుగానే రిపోర్టు తయారుచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అదేవిధంగా ‘వ్యవసాయ ఖర్చులు.. ధరల కమిషన్’ (సీఏసీపీ) దేశంలోని అన్ని ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరను సిఫారసు చేస్తుందని, దానికి మారెటింగ్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న కోహెడ మారెట్ యార్డులోని ఇరాడియేషన్ యూనిట్‌ను వెంటనే పూర్తి చేసి, వచ్చే మామిడి సీజన్ వరకు రైతులకు అందుబాటులోకి తేవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కావాల్సిన భూమిని ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచేశారు. అలాగే, సీఎం రేవంత్‌రెడ్డి సూచనల ప్రకారం కోహెడ మారెట్ యార్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు.