Big Brother | (స్పెషల్ టాస్క్బ్యూరో) : నాదర్గుల్ అసైన్డ్ భూములను అక్రమంగా పూలింగ్ చేస్తున్న వ్యవహారంపై నమస్తే తెలంగాణ పూర్తి ఆధారాలతో కథనం ప్రచురించింది. అయితే అక్రమాలకు అంటకాగుతున్న కొందరు పెద్దలు.. అటు రైతులను, ఇటు నమస్తే తెలంగాణను బెదిరించి లొంగదీసుకోవాలని విఫలయత్నం చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది? రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామం సర్వే నంబరు 92లో దాదాపు 300 ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించేందుకు ప్రవీణ్‌రెడ్డి, ఆయన వెనక ఉన్న కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్టు నమస్తే తెలంగాణ అక్టోబరు 31 గురువారం రోజున ‘బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్’ పేరిట కథనం ప్రచురించింది.
నిరుపేదలకు సర్కారు ఇచ్చిన అసైన్డ్ భూమిని, తిరిగి తీసుకోవాలంటే చట్ట ప్రకారం అదీ కేవలం ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం. అసైన్డ్ భూమిని సేకరించే అధికారం ప్రైవేటు వ్యక్తులకు లేనేలేదు. ఈ విషయాన్నే నమస్తే తెలంగాణ స్పష్టంచేసింది. ఒకవేళ అసైనీలు తమ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే, అది చెల్లదనీ, దీనివల్ల ప్రభుత్వం ఆ భూమిని రైతుల నుంచి తిరిగి తీసుకునే ప్రమాదం ఉన్నదనీ నమస్తే తెలంగాణ అప్రమత్తం చేసింది. రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో వారిని చైతన్య పరిచే ప్రయత్నం చేసింది. కానీ ‘నమస్తే తెలంగాణ’ పై నే ఉల్టా కేసులు పెట్టడం అనేక అను మానాలకు తావిస్తున్నది. దీని వెనుక ఏ ఒత్తిళ్లు పనిచేశాయి? అక్రమార్కు లకు అంటకాగుతున్నదెవరు?
ప్రశ్న- 1. ఒక రైతు ఫిర్యాదు చేశాడనే పేరుతో పోలీసులు నమస్తే తెలంగాణపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాన్ని వెలుగులోకి తెస్తే, రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రచురిస్తే కేసులు పెడుతరా?
ప్రశ్న- 2. ‘నమస్తే తెలంగాణ’ది తప్పుడు కథనమని, సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, పలు సెల్ఫ్ కాంట్రడిక్షన్స్తో ఆదివారం డీసీపీ పేరిట పోలీసు శాఖ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. దాని ప్రకారం చూసినా.. అక్కడ అసైన్డ్ భూమి లావాదేవీలకు సంబంధించి అక్రమాలు జరిగినట్టు స్థానిక తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరుపుతున్నామని కూడా పోలీసులు పేర్కొన్నారు. తహసీల్దార్ ఫిర్యాదు చేశారంటేనే ‘నమస్తే తెలంగాణ’ కథనం సత్యమని రుజువైంది. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ‘నమస్తే తెలంగాణ’పై కేసు పెట్టారు?
ప్రశ్న- 3. తహసీల్దారు ఫిర్యాదు మేరకు ప్రవీణ్‌రెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, విచారించినట్టు పోలీసు శాఖ తన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నది. అసైన్డ్ లావాదేవీల వెనక ప్రవీణ్‌రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు ‘నమస్తే తెలంగాణ’ ముందే చెప్పింది. అంటే ప్రవీణ్‌రెడ్డి అనే వ్యక్తి పాత్ర గురించి పూర్తి స్పష్టత ఉన్నది. అలాంటప్పుడు శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ‘నమస్తే తెలంగాణ’ చేజిక్కిన ఎఫ్ఐఆర్ కాపీలో ‘గుర్తుతెలియని వ్యక్తులు’ (సమ్ అన్నోన్ పర్సన్స్) అని పోలీసులు ఎందుకు పేర్కొన్నట్టు? ఆ ఎఫ్ఐఆర్ కాపీ బయట పడకుండా ఎందుకు బ్లాక్ చేసినట్టు? దీని వెనక ఏ బిగ్ హ్యాండ్స్ ఒత్తిడి ఉన్నట్టు?
ప్రశ్న- 4. ఎఫ్ఐఆర్లో ప్రవీణ్‌రెడ్డి పేరు ఏది? అని ప్రశ్నిస్తూ ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం మళ్లీ కథనం ప్రచురించింది. ఆ మధ్యాహ్నం పోలీసులు ఇదిగో ప్రవీణ్‌రెడ్డి పేరు ఉన్నది అంటూ ఓ ఎఫ్ఐఆర్ కాపీని రిలీజ్ చేశారు. అదే సమయంలో గాంధీభవన్‌లో టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఎఫ్ఐఆర్లో ప్రవీణ్‌రెడ్డి పేరు ఉన్నదని వెల్లడించారు. మామూలుగా ఎఫ్ఐఆర్ ఒకసారే నమోదవుతుంది. ముందు ‘నమస్తే తెలంగాణ’ చేజిక్కిన ఎఫ్ఐఆర్లో ‘అన్నోన్ పర్సన్స్’ అని ఎందుకున్నది? తర్వాత సేమ్ నంబర్‌తో పోలీసులు విడుదల చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో ప్రవీణ్‌రెడ్డి పేరు ఎట్లా వచ్చింది? ఎక్కడో మీర్పేట్ పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ వివరాలు మీడియాకు కూడా తెల్వక ముందే కాంగ్రెస్ ప్రతినిధికి ఎలా అందాయి? ప్రవీణ్‌రెడ్డి పేరుతో జరుగుతున్న ఒక చట్ట విరుద్ధమైన పనిని ‘నమస్తే తెలంగాణ’ బయటపెడితే, దానికి కాంగ్రెస్ ఎందుకు భుజాలు తడుముకున్నది? కాంగ్రెస్ కాపాడాలనుకుంటున్న ఆ బిగ్ బ్రదర్స్ ఎవరు?
ప్రశ్న- 5. అసైన్డ్ భూమి అక్రమ లావాదేవీలపై దర్యాప్తు కోరుతూ తహసీల్దార్ ఫిర్యాదు చేశారని ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 2వ తేదీన ప్రచురించిన కథనంలోనే చెప్పింది. అయితే స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ మాత్రం ఎన్నిసార్లు అడిగినా తనకు ఫిర్యాదేదీ అందలేదని చెప్తూ వచ్చారు. అయితే 31వ తేదీ సాయంత్రమే తహసీల్దార్ ఫిర్యాదు అందినట్టుగా ఆ కాపీ మీద సీఐ సంతకం ఉన్నది. మండలస్థాయి మెజిస్ట్రేట్ నుంచి ఫిర్యాదు అందినా, తనకు అందలేదని సీఐ ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? ఎవరి ఒత్తిడి మేరకు ఆయన ఇలా వ్యవహరించారు?
ప్రశ్న- 6. తహసీల్దార్ పోలీసులకు తాను చేసిన ఫిర్యాదులో ‘నమస్తే తెలంగాణ’ కథనం మేరకు అని కానీ, పత్రికల్లో వచ్చిన వార్తల మేరకు అని కానీ ఎక్కడా పేర్కొనలేదు. అసైన్డ్ భూములపై అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని అధికారి తనకుతానుగా ఫిర్యాదుచేశారు. యాదృచ్ఛికంగా అదే సమయంలో ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. పత్రిక కథనం, ఎమ్మార్వో ఫిర్యాదు.. రెండింటి సారాంశం ఒక్కటే. ఎమ్మార్వో ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న పోలీసులు, నమస్తే తెలంగాణపై మాత్రం కేసులు పెట్టడం ద్వంద్వనీతి కాదా? మరి పత్రికపై కేసులు పెట్టిన పోలీసులు, తహసీల్దార్ పైనా పెడ్తారా? బాధ్యతగల ప్రభుత్వ అధికారిగా తహసీల్దార్ రైతుల పక్షాన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతే బాధ్యతగా నమస్తే తెలంగాణ రైతుల పక్షాన ప్రశ్నించింది. అసైన్డ్ భూములను చెరబడుతున్న అక్రమార్కుడి వివరాలను ఆధారాలతో సహా ప్రచురించింది. వాస్తవానికి ‘నమస్తే తెలంగాణ’ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చాకే తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. అధికారి ఫిర్యాదు సక్రమమైతే, నమస్తే తెలంగాణ కథనం అసత్యం ఎట్లా అయ్యింది? అధికారి ఫిర్యాదుతో అక్రమార్కుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అధికారి ఫిర్యాదుకు ఆధారమైన కథనాన్ని అందించిన ‘నమస్తే తెలంగాణ’ మీద మాత్రం కేసులు ఎలా పెట్టగలిగారు?
ప్రశ్న- 7. అసైన్డ్ భూమిని ప్రవీణ్‌రెడ్డి సేకరించే క్రమంలో కుదుర్చుకున్న ఒక ఒప్పందాన్ని ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది? చట్టాన్ని సంరక్షించాల్సిన పోలీసులు.. చట్ట విరుద్ధమైన పనిని ఆపాలి. ప్రభుత్వం మొత్తం భూమిని తీసుకునే ప్రమాదముందని, ఇలాంటివి చేయొద్దని రైతుని, ప్రైవేటు వ్యక్తులను ఎన్లైటెన్ చేయాలి. దానికి భిన్నంగా ‘నమస్తే తెలంగాణ’పై కేసు పెట్టడమేమిటి? కథనం వల్ల రైతుకి జరిగిన నష్టమేమిటో, ఏ ప్రాతిపదికన కేసు పెట్టారో పోలీసులు చెప్పగలరా?
ప్రశ్న- 8. ‘నమస్తే తెలంగాణ’ కథనం, తర్వాత తహసీల్దారు ఫిర్యాదుపై విచారణ కొనసాగుతున్నదని ఆదివారం (నవంబర్ 3వ తేదీ) సాయంత్రం రాచకొండ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాంటప్పుడు ‘నమస్తే తెలంగాణ’ది తప్పుడు కథనమని 31నాడే తేల్చి ఎలా కేసు నమోదు చేశారు? తప్పుడు కథనమైతే తహసీల్దార్ దేని మీద ఫిర్యాదు చేసినట్టు? దాన్ని సీఐ ఎందుకు స్వీకరించినట్టు? ఇప్పుడు రాచకొండ పోలీసులే అంగీకరించినట్టు… విచారణ దేనిమీద జరుపుతున్నట్టు?
ప్రశ్న- 9. అసైన్డ్ భూమిని ఇవ్వనందుకు, అగ్రిమెంట్లు అయిన రైతులతో కలిసి, తన ఇంటి ముందు ప్రవీణ్‌రెడ్డి జేసీబీతో కందకం తవ్వి, బెదిరింపులకు పాల్పడినట్టుగా నర్సింహ అనే రైతు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే అక్రమ లావాదేవీలు, బెదిరింపులు జరుగుతున్నట్టు స్పష్టంగా బయటపడింది. మరి పోలీసులు విచారణ చేయాల్సింది అక్రమ లావాదేవీల మీదనా? నమస్తే తెలంగాణ మీదనా?
కుదిరిన ఒప్పందం
17.07.2024
అసైన్డ్ భూమి తీసుకుని ప్రతిగా.. లేఅవుట్ తర్వాత వెయ్యి గజాల స్థలం, రూ.10 లక్షలు ఇస్తామంటూ ప్రవీణ్‌రెడ్డి జూలై 17న రైతుతో చేసుకున్న అగ్రిమెంట్ కాపీ
బయటపెట్టిన నమస్తే తెలంగాణ
31.10.2024
నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అగ్రిమెంట్ల వ్యవహారాన్ని బయటపెడుతూ నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనం
తహసీల్దార్ ఫిర్యాదు
31.10.2024
నమస్తే తెలంగాణ బయటపెట్టిన ల్యాండ్ పూలింగ్ వ్యవహారంపై అక్రమాలపై దర్యాప్తు కోరుతూ అదే రోజున బాలాపూర్ తహసీల్దార్ మీర్పేట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీ
గుర్తు తెలియని వ్యక్తులట!
31.10.2024: తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ. ప్రవీణ్‌రెడ్డి పేరును నమస్తే తెలంగాణ బయట పెట్టినప్పటికీ.. ఏ ఒత్తిళ్లు పనిచేశాయో గానీ పోలీసులు ‘గుర్తుతెలియని వ్యక్తులే’ నిందితులు అన్నట్టుగా ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం.
చివరికి ఒప్పుకోలు..
31.10.2024: అదే ఎఫ్ఐఆర్ నంబర్!.. అదే తేదీ, సమయం! కొందరు పెద్దల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్తూ ‘నమస్తే’ మరో కథనాన్ని ప్రచురించగానే అప్పటివరకు ఎఫ్ఐఆర్లో ‘గుర్తుతెలియని వ్యక్తులు’గా ఉన్నచోట ప్రవీణ్‌రెడ్డి పేరు వచ్చి చేరింది.
ప్రవీణ్‌రెడ్డిపై రైతు ఫిర్యాదు
03.11.2024 భూముల కోసం ప్రవీణ్‌రెడ్డి అనుచరుల దౌర్జన్యాలు, రైతులకు వేధింపులు నిజమేననడానికి తాజా సాక్ష్యమిది. భూమి ఇవ్వనన్నందుకు తన ఇంటిముందు రాత్రికి రాత్రి కందకం తవ్వారని పేర్కొంటూ మీర్పేట్ పోలీసులకు రైతు నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు కాపీ.