Ground Water | నిర్మల్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : ఎండాకాలం రాకముందే భూగర్భంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భూ గర్భ జలాలు క్రమంగా పాతాళం వైపు పయనిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే మీటరుకుపైగా లోతుకు నీటిమట్టాలు పడిపోయా యి. ఇదీ ఇలాగే కొనసాగితే వచ్చే రెండు, మూడు నెలల్లో బోరుబావులు ఎత్తిపోయి యాసంగిలో వేసిన పంటలకు చివరి దశలో నీరందే అవకాశం లేకుండాపోతుంది. గత జనవరి నెల మొదటి వారంలో జిల్లావ్యాప్తంగా సగటున 6.80 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, ప్రస్తుతం 8.20 మీటర్లకు పడిపోయాయి. అంటే కేవలం నెల రోజుల్లోనే దాదాపు 1.5 మీటర్ల లోతుకు నీటి మట్టాలు పడిపోవడం అన్నదాతకు ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పుడే పరిస్థితి ఇలావుంటే వచ్చే వేసవిలో భూగర్భ నీటి మట్టాలు గణనీయంగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిరుడు జనవరిలో ఇప్పటి కంటే కా స్త మెరుగ్గా 7.87 మీటర్ల జిల్లా సగటు నీటిమట్టాలు ఉండేవి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 45 వేల వరకు బోరుబావులు ఉన్న ట్టు అధికారులు చెప్తున్నారు. ఈ బోరుబావుల కింద అత్యధికంగా వరి సాగు చేస్తున్నారు. దీం తో నీటి వినియోగం బాగా పెరగడంతో భూ గర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ఈ సారి వానకాలంలో 12 శాతం అధికంగా వర్షపాతం నమోదైనప్పటికీ, యాసంగి సాగు వి స్తీర్ణం పెరగడంతో బోరుబావుల ద్వారా నీటి వినియోగం పెరిగింది. సాగు నీటి కోసం రైతు లు ఎక్కువగా భూగర్భ జలాలపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యత తగ్గితే.. రైతులు మరో కొత్త బోరుకు ప్రయ త్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. తాగునీటి అవసరాలకు మాత్రమే కొత్త బోర్లు వేయాలని భూగర్భ జల శాఖ అధికారులు ఇ ప్పటికే ఆదేశాలు జారీ చేశారు. భూమిలో నీటి లభ్యతనే లేనప్పుడు కొత్త బోర్లు వేసి ఆర్థికం గా నష్టపోయే బదులు అందుబాటులో ఉన్న నీటితో సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకోవాలని సూ చిస్తున్నారు. ఇకపై ప్రతినెలా మీటరు నుంచి మీటరున్నర వరకు భూగర్భ జలాలు తగ్గిపో యే అవకాశం ఉండటంతో వచ్చే ఏప్రిల్, మే నెలలో రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో నీరందకపోతే పంట లు ఎండిపోయి దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది.
యాసంగిలో 3 లక్షల ఎకరాల్లో పంటలు..
ఈ యాసంగిలో అన్ని రకాలు కలుపుకొని 3 లక్షల ఎకరాల్లో పంటలు వేయనున్నారు. ఇందులో 1.10 లక్షల ఎకరాల్లో వరి, 1.02 లక్షల ఎకరాల్లో మక్క, 35 వేల ఎకరాల్లో జొన్న, 55 వేల ఎకరాల్లో శనగ పంటలు సాగవుతాయని అంచనా వేశారు. చాలాచోట్ల మక్క, జొన్న, శనగ పంటలను నెల రోజుల క్రితమే వేయడంతో ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. ఒక్క వరి మాత్రం ఇప్పుడిప్పుడే నాట్ల దశలో ఉన్నది.