ఖిల్లాఘణపురం, ఫిబ్రవరి 16 : మహత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీకేఎల్ఐ) ద్వారా సాగునీరు వచ్చాక గ్రామాల్లో ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో మంత్రి పల్లెనిద్ర చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. గ్రామ సమీపంలోని రెడ్డి చెరువు వద్ద ఆంజనేయస్వామి ఆలయంలో దేవతామూర్తులను దర్శించుకొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు సాయంగా రూ.20 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం మంత్రి గ్రామంలో పర్యటించనున్నారు.