Gouravelli Reservoir | సిద్దిపేట, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాళ్లు రప్పలతో నిండిన గుట్టల ప్రాంతం. సాగునీటికి అల్లాడిన రైతాంగం. పూర్తిగా వర్షాధార మెట్ట పంటలు. వరుణుడు కరుణిస్తే చేతికి పంటలు. కాలం కలిసి రాకుంటే వలసబాటలు.. ఇదీ ఒకనాటి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల దుస్థితి. నాటి ఉమ్మడి పాలకులు గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మిస్తామని హామీ ఇచ్చి శిలాఫలకాలు వేశారే తప్ప తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు. రైతుల గోడు పట్టించుకోలేదు. ఈ ప్రాంత రైతుల బాధను కండ్లారా చూసిన కేసీఆర్.. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసే పనిని భుజానికెత్తుకున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కాళేశ్వరం కట్టి ఆ నీటిని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వరకు ఎత్తిపోశారు. ఇటీవలే గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. దశాబ్దాల హుస్నాబాద్ ప్రజల కల సాకారమైంది. నాలుగు జిల్లాల్లో 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భరోసా ఏర్పడింది.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం పూర్తిగా మెట్టప్రాంతం. ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మించాలని ఉమ్మడి పాలకులు శంకుస్థాపన చేశారు. ఎస్సారెస్పీ ప్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేరుకు, అక్కడి నుంచి తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ ద్వారా గౌరవెల్లి లిప్ట్ కెనాల్‌తో నీటిని నింపేలా 2008-09లో ప్రా జెక్టు పనులు ప్రారంభించారు. తర్వాత పనులు పడకేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు.గౌరవెల్లి ప్రాజెక్టు సామర్ధ్యం 1.41 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీలకు పెంచారు. ఆ మేరకు భూసేకరణ చేశారు. ముంపు గ్రామాలకు కొత్త చట్టం ప్రకారం పరిహారం అందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు అందించి మెట్ట ప్రాంతం సస్యశ్యామలం చేయడం కోసం యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసింది. జూన్ 29నే ట్రయల్న్ ద్వారా రిజర్వాయర్‌లోకి 0.5 టీఎంసీల కాళేశ్వరం జలాలను ఎత్తిపోసింది.
రాజరాజేశ్వర జలాశయం నుంచి నీళ్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేరు) నుంచి తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి వచ్చి పడ్డాయి. తోటపల్లి నుంచి నార్లాపూర్ వరకు 8 కిలోమీటర్ల లింక్ కెనాల్ ద్వారా నీళ్లు వస్తాయి. అక్కడి నుం చి గొట్లమిట్ట వరకు అప్రోచ్ కెనాల్ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడి నుంచి సుమారుగా 12 కి.మీ. మేర సొరంగం ద్వారా రేగొండ పం ప్హౌస్కు కాళేశ్వరం జలాలు చేరుకుంటాయి. రేగొండ వద్ద పంపుల ద్వారా నీటిని గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. 32 మెగావాట్ల 3 మోటార్లు 126 మీటర్లు ఎత్తిపోసే విధంగా మహాబలి మోటర్లు బిగించారు. ఒకటో నంబర్ పంప్‌ను ఆన్ చేసి ఇటీవలే రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తి పోశారు. కాళేశ్వరం జలాలను తాకిన చేతులతోనే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు చేతులెత్తి మొక్కారు.
గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా 1,06,000 ఎకరాలకు సాగునీరు
గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా 1.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. కుడి ప్రధాన కాల్వ ద్వారా 90,000 ఎకరాలకు, ఎడమ ప్ర ధాన కాల్వ ద్వారా 16,000 ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. సిద్దిపేట, వరంగల్ అర్బన్, కరీంనగర్, జనగామ జిల్లాల రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, సైదాపూర్, చిగురుమామిడి, భీమదేవరపల్లి మండలాల్లోని 57,852 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. స్టేషన్ఘనపూర్ నియోజకవర్గంలోని వేలేరు, ధర్మసాగర్, భీమదేవరపల్లి, ఖాజీపేట, చిల్పూర్, స్టేషన్ఘనపూర్, రఘునాథపల్లి, జాఫర్‌గఢ్ మండలాల్లోని 48,148 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. గౌరవెల్లి కుడి, ఎడమ ప్రధాన కాల్వలది పోను, మిగతా 14 వేల ఎకరాలకు గండిపల్లి కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీరు అందిస్తారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా మొత్తం 1,20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు.
మానేరు లాగా గౌరవెల్లి డ్యాం..
డ్యాం అంటే మానేరు డ్యామేనని ఎరు క. గట్లాంటి మన కరువు జాగల కేసీఆర్ సార్ పెద్ద డ్యాం కట్టించుడు సంతోషంగా ఉంది. నీళ్లే మనకు ఆధారం. ఈ డ్యాంకనక కట్టకుంటే మన రైతులది బిచ్చపు బతుకే అయితుండే. డ్యాంలతోనే మన బతుకులు బాగుపడుతయి. బాయిలల్ల, బోర్లల్ల నీళ్లు ఉబ్బుతయి. ఎవుసం మంచిగ నడుస్తది. దీనిమీదనే మంచిగ బతుకొచ్చు.
-గొల్లపల్లి నర్సయ్య, రైతు, మాలపల్లి, హుస్నాబాద్ మండలం
కలల కూడా అనుకోలే…
గౌరవెల్లి డ్యాం కలల కూడ ఇది అయితది అనుకోలే. దీంతో రైతులకు సానలాభం, ఎవసం సేసుకునేటోల్లకు నీళ్లు కావాలె. ఆ నీళ్లు ఉండాలనే డ్యాం కట్టుడు. డ్యాంతో రైతులకు ఇప్పుడు ఇబ్బంది లేకుంట అయ్యింది. డ్యాంలకెల్లి జాలువారిన రెండు పంటలు పండుతయి. ఈ డ్యాం పడుడు మా రైతులకు సాన లాభం. ఎవుసం సెయ్యబట్టి కూలికిపోవుడు బంద్అయ్యింది.
-కొంరెల్లి, రైతు, చౌటకుంట (సిద్దిపేట జిల్లా)