హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 90 వేల ఎకరాలకు సాగునీటిని అందించే 3 చెన్నూరు ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,658 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి, చెన్నూరు మండలాల పరిధిలోని 102 పంచాయతీల్లో ఉన్న 367 చెరువులను నింపడం ద్వారా 90 వేల ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఎత్తిపోతల పథకాన్ని సర్కారు రూపొందించింది. అందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మి, సరస్వతి, పార్వతి బరాజ్‌ల బ్యాక్ వాటర్ నుంచి 10 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నది. అందుకు మూడు లిఫ్ట్‌లను ఏర్పాటు చేయనుండగా, రూ.1,658 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇటీవలే ఈ ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదం తెలుపగా, తాజాగా నిధులు మంజూరయ్యాయి.