న్యూఢిల్లీ : ఆదాయ స్థాయిలలో స్థిరమైన వృద్ధిని సాధించినందుకు గాను ప్రపంచ బ్యాంక్ తాజాగా శ్రీలంక, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలను ఉన్నత ఆదాయ వర్గాలుగా అప్గ్రేడ్ చేసింది. అయితే భారతదేశం మొత్తంగా దిగువ మధ్య తరగతి ఆర్థిక వ్యవస్థగానే కొనసాగుతున్నది. ప్రపంచ బ్యాంక్ అట్లాస్ పద్ధతి ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం రూ.2,32,000గా ఉంది. ఇది దిగువ మధ్య తరగతి సగటు ఆదాయం రూ.2,09,000 కంటే కొంచెం అధికం. భారతదేశంలోని వివిధ రాష్ర్టాల తలసరి ఆదాయ పరిస్థితుల విషయానికొస్తే రూ.5,22,000తో ఢిల్లీ అగ్రస్థానంలో నిలువగా, ఆ తర్వాత స్థానంలో కర్ణాటక(రూ.4,68,600), తెలంగాణ(రూ.4,54,000), తమిళనాడు(రూ.4,47,600), గుజరాత్(రూ.3,97,600) ఉన్నాయి.
ఈ ఐదు రాష్ర్టాలు ప్రపంచబ్యాంక్ నిర్దేశించిన ఎగువ మధ్య తరగతి పరిమితిని దాటేశాయి. మహారాష్ట్ర, హర్యానా, కేరళలు స్వల్ప తేడాతో ఈ బెంచ్ మార్కును అందుకోలేకపోయాయి. దేశంలో అత్యంత పేద రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఇక్కడ తలసరి ఆదాయం కేవలం రూ.82,600. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్టాల ఆదాయాలు నేపాల్, ఆఫ్రికా దేశాల కంటే కూడా తక్కువగా ఉండటం గమనార్హం. 1994-95లో అన్ని పెద్ద రాష్ర్టాల కంటే అత్యధిక తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ ప్రస్తుతం మొదటి ఏడు రాష్ర్టాల కంటే వెనుకబడిపోయింది.