హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంపులో నీటిపారుదలశాఖ డివిజన్- 8లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌పై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అదాయానికి మించిన అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. శ్రీధర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో కరీంనగర్లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌కు తీసుకొచ్చిన ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
మలక్‌పేట్‌లోని శ్రీధర్ నివాసం, కార్యాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లోని అతని బంధువులు, స్నేహితులకు చెందిన ఇండ్లలో తనిఖీలు చేపట్టింది. శ్రీధర్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేట్‌లో ఫ్లాట్, కరీంనగర్లో మూడు ఇంటి స్థలాలు, అమీర్‌పేట్‌లో కమర్షియల్ కాంప్లెక్స్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 3 ఇండ్లు, 19 ఇంటి స్థలాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్టు గుర్తించారు. శ్రీధర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ కొనసాగుతున్నదని వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ వర్క్‌షాప్ సమీపంలో ఉన్న శ్రీధర్ ఇంటితో పాటు భాగ్యనగర్‌లోని ఆయన బంధువుల ఇంట్లో అవినీతినిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న చొప్పదండి డివిజన్ కార్యాలయంలో కూడా దాడులు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు స్థానిక ఏసీబీ అధికారులతో కలిసి ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సోదాలు చేశారు.