హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డ్యామ్‌ల సమగ్ర భద్రత మూల్యాంకనం(సీడీఎస్ఈ) కోసం ప్రత్యేకంగా కోర్ టెక్నికల్ బృందాన్ని ఇరిగేషన్‌శాఖ ఏర్పాటుచేసింది. ఈ మేరకు ఈఎన్సీ అడ్మిషన్ రమేశ్‌బాబు తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. జలాశయాల పనితీరును నిర్ధారించడానికి సరైన నిఘా, తనిఖీ, ఆపరేషన్, నిర్వహణ, రక్షణ, ప్రమాదాలకు బాధ్యులను నిర్ధారిస్తూ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021ని కేంద్రం తీసుకొచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసులు-2023 పేరిట కేంద్రం అందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆనకట్టల పరిమాణం, ఎత్తు తదితర ప్రమాణాల ఆధారంగా రాష్ట్రంలో ఎన్డీఎస్ఏ చట్టం పరిధిలోకి 175 ప్రాజెక్టులు చేరాయి.
ఎన్డీఎస్ఏ చట్టం అమలుకు సీడీఎస్ఈ కీలకమైనది. దీనిని 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉన్నది. సీడీఎస్‌ఈని ప్రాజెక్టుల యజమానులు నిర్వహించాల్సి ఉన్నది. ఎన్డీఎస్ఏ చట్టం సెక్షన్-38(1) ప్రకారం సంబంధిత ఆనకట్టల భద్రతకు సంబంధించి సమగ్ర మూల్యాంకనం చేయాలి. ప్రతి ఆనకట్టకు సంబంధించి డిజిటల్ లాగ్‌బుక్‌లు, డాటాబేస్‌ను డిజిటల్ రూపంలో పొందుపర్చాలి. ప్రతి ఆనకట్టకు సంబంధించి సీడీఎస్‌ఈని 2026 డిసెంబర్ నాటికి పూర్తిచేయాల్సి ఉన్నది.
ఇందుకు 15 నెలల గడువు మాత్రమే ఉన్నది. ఇప్పటికీ రాష్ట్రంలో ఒక్క ఆనకట్టకూ సీడీఎస్‌ఈని రూపొందించకపోవడంతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాయడం గమనార్హం. ఇదే విషయమై ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో ఇరిగేషన్‌శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇరిగేషన్‌శాఖ ఓఅండ్ఎం ఈఎన్సీ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ తాజాగా సీడీఎస్ఈను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు, పర్యవేక్షణకు 8 మంది కోర్ టీం ఏర్పాటుచేసింది.