హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : ఇరిగేషన్‌శాఖలో ఇటీవల ఇష్టారీతిన బదిలీలు నిర్వహించారు. తాజాగా వాటిని దిద్దుకొనేందుకు ఓడీ (ఆఫీసర్ ఆన్ డ్యూటీ)లను మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికిపైగా ఇంజినీర్లకు ఓడీల ను జారీ చేయగా, మరి కొందరికి ఇచ్చేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. ప్రభుత్వం గత నెలలో బదిలీలకు అవకాశం కల్పించింది. ఒకే స్టేషన్ లో నాలుగేండ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న అన్ని ప్రభుత్వశాఖల్లోని అధికారులను బదిలీ చేయాలని ఆదేశించి, స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. ఇరిగేషన్‌శాఖలో మొత్తం గా సీఈలు, ఎస్ఈలు కలిపి 32మంది, ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు) 63 మంది, డీఈఈలు 350 మంది, ఏఈఈలు 650 మంది వరకు బదిలీ అయ్యారు.
ఈ బదిలీల్లోనూ ఉన్నతాధికారులు భారీ అవకతవకలకు పాల్పడ్డారని, ఇష్టారీతిన నిర్వహించారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు సైతం అందుకు బలా న్ని చేకూర్చుతున్నది. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో ఉద్యోగుల నుంచి ఆప్షన్ తీసుకొని, సదరు ఉద్యోగి ఎంపిక చేసుకున్న ఆప్షన్లలో ఏదో ఒక ప్రాంతానికి బదిలీ చేయాలి. ఒకవేళ ఆ స్థానాల్లో ఖాళీ లేకుంటే సదరు ఉద్యోగికి మరోసారి ఆప్షన్ ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. కానీ ఉన్నతాధికారులు ఆ నిబంధనలను తుంగలో తొక్కి, ఆప్షన్లను పక్కకు పెట్టి అనేకమంది ఇంజినీర్లను ఇష్టానుసారం బదిలీచేశారు.
రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ జాబితాలో ఉన్నవారికి కోరుకున్న చోటనే అవకాశం కల్పించాలి. అక్కడ ఖాళీ లేకుంటే ప్రస్తు తం వారు పనిచేసే స్థానంలోనే కొనసాగించాలి. కానీ ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు మాత్రం రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నవాళ్లను సైతం ఇష్టారీతిన వేరే ప్రాంతానికి బదిలీ చేయడం కొసమెరుపు. ఇవిగాకుండా నాలుగేండ్లకు పైబడి ఒకే స్టేషన్లో పనిచేస్తున్న అనేకమంది ఇంజినీర్లను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ పేరిట అక్కడే కొనసాగించారు. పొరపాట్లను సవరించకపోతే ధర్నాలకు దిగుతామని ఇంజినీర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇప్పుడు ఓడీల పేరిట సదరు ఇంజినీర్లను బుజ్జగిస్తున్నారు. ఇప్పటికే శాఖలో దాదాపు 40 మందికిపైగా ఇంజినీర్లకు డిప్యుటేషన్లు కల్పించడం గమనార్హం. మరో 50 మందికి పైగా ఇంజినీర్లకు డిప్యుటేషన్లను కల్పించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.