హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణం వెలుగుచూస్తున్నది. ఇటీవల సోం డిస్టిలరీ మద్యాన్ని అనుమతించి అభాసుపాలైన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో అతినీతికి పాల్పడిందనే విమర్శలు వెల్లువెతున్నాయి. అక్రమ మద్యం కట్టడి కోసం తీసుకొచ్చిన హై సెక్యూరిటీ హోలోగ్రామ్ 2డీ బార్కోడ్ లేబుల్స్ ప్రింటింగ్‌ను ఏకపక్షంగా గడువు తీరిన కంపెనీకే కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా రూ.100 కోట్ల టర్నోవర్ ఉండే లేబుల్స్ ప్రింటింగ్‌ను గుట్టుచప్పుడు కాకుండా ఒక కంపెనీకి అప్పగించడం వెనుక పెద్దల స్థాయిలో కుదిరిన అక్రమ ఒప్పదం ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ మద్యం, నకిలీ మద్యం కట్టడి కోసం మద్యం బాటిళ్లపై హై సెక్యూరిటీ హోలోగ్రామ్ 2డీ బార్కోడ్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్నది. హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్(హెచ్‌పీఎఫ్‌ఎస్) అనే సాఫ్ట్వేర్ ద్వారా డిస్టిలరీ నుంచి మొదలుకుని మద్యం డిపోలు, వైన్‌షాపుల వరకు అనుసంధానం చేసింది.
మద్యం బాటిల్‌ను స్కాన్ చేయగానే సదరు మద్యం తయారైన డిస్టిలరీ, అక్కడి నుంచి వెళ్లిన డిపో, వైన్స్ వివరాలతోపాటు అది ఏ రకం బ్రాండ్? దాని రేటెంత? తదితర సమాచారం మొత్తం వస్తుంది. దీంతో మద్యం సీసా మీద ఉన్న ఎమ్మార్పీ కంటే దుకాణాల్లో ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉండదు. వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతూ నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్డీపీఎల్), నకిలీ మద్యం లాంటివి తెస్తే వెంటనే దొరికిపోతాయి. 90 ఎంఎల్ నిబ్ నుంచి ఫుల్ బాటిల్ వరకు కలుపుకొని రాష్ట్రంలో నెలకు దాదాపు 20 కోట్ల సీసాల మద్యం అమ్ముడవుతున్నది. ఆయా బాటిళ్ల మూతల మీద హోలోగ్రామ్ 2డీ బార్కోడ్ లేబుల్‌ను అతికిస్తారు. ఈ లేబుల్స్ ప్రింటింగ్, సరఫరా, మెయింటెనెన్స్ కోసం అప్పటి ప్రభుత్వం టెండర్లు పిలిచి, ఒక కంపెనీకి బాధ్యతులు అప్పగించింది. సదరు కంపెనీ మరో సాఫ్టువేర్ కంపెనీతో కలిసి కన్సార్టియంగా ఏర్పడి లేబుల్స్ ఉత్పత్తి, సరఫరా చేశాయి. దాని కాంట్రాక్టు గడువు ముగియడంతో, సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చే ఔత్సాహిక సంస్థలకు అవకాశం కల్పిస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీచేయాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. పాత పద్ధతిలో ఎక్సైజ్ శాఖ ద్వారానే కొనసాగిన టెండర్ల ప్రక్రియను మరింత కట్టుదిట్టంగా నిర్వహించే బాధ్యతను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్)కు అప్పగింది. దీంతో టీఎస్టీఎస్ 2022 నవంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 15 కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపాయి.
పాత కంపెనీకే అనుమతుల వెనుక మతలబు?
కాంగ్రెస్ ప్రభుత్వం బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసింది. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా లేదా కొనసాగించకుండా కోల్డ్‌స్టోరేజీలో పెట్టింది. పాత కంపెనీకే మళ్లీ లేబుల్స్ ప్రింటింగ్‌ను అనుమతించింది. పాత పద్ధతిలోనే సదరు కంపెనీకి బిల్లులు చెల్లిస్తున్నది. కంపెనీకి పాత ఒప్పందం ప్రకారం టీఎస్‌బీసీఎల్ బిల్లు చెల్లించడంలోనే భారీ మోసం ఉన్నదని తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. నిజానికి హెడానిక్ పాత్ ఫైన్డర్ సాఫ్ట్వేర్ సిస్టమ్‌ను దేశంలోనే తొలుత అమలు చేసిందే తెలంగాణ ప్రభుత్వం. అప్పట్లో ఇంకా ఇటువంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. స్టాఫ్ట్వేర్ విడిభాగాలు, మిషనరీ కూడా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొంత ఎక్కువ ధర చెల్లించి హై సెక్యూరిటీ హోలోగ్రామ్ 2డీ బార్కోడ్ లేబుల్స్ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది.
సాంకేతికతను ప్రోత్సహించడం కోసం అద్దె లేకుండా ప్రింటింగ్ కంపెనీకి ఎక్సైజ్ అకాడమీలో మూడేండ్ల కాల పరిమితితో మూడువేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. ఇందుకు ప్రతిఫలంగా లీజు కంపెనీ అకాడమీలో ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వాలని, గడువు ముగిసిన తరువాత ప్రింటింగ్ బేసిక్ మిషన్లను ఎక్సైజ్ శాఖకు అప్పగించి వెళ్లాలనే ఒప్పందం చేసుకున్నారు. కానీ, ఇప్పుడు అతిచౌక ధరకే నాణ్యమైన హెడానిక్ పాత్ ఫైన్డర్ సాఫ్ట్‌వేర్‌తోపాటు ఒక్క బటన్ క్లిక్‌తో రోజుకు కోటి లేబుల్స్‌ను ఉత్పత్తి చేయగల మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. గరిష్ఠంగా ఐదు పైసల నుంచి ఏడు పైసల ఖర్చుతో హై సెక్యూరిటీ హోలోగ్రామ్ 2డీ బార్కోడ్ లేబుల్ తయారవుతున్నది. ఈ పరిస్థితుల్లో పాత ధరలే చెల్లించడంలో మతలబు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు కంపెనీ యాజమాన్యం గడుపు తీరినప్పటికీ అకాడమీ స్థలాన్ని ఉచితంగా వాడుకుంటున్నది. కమర్షియల్ స్పేస్‌కు కనీసం చదరపు అడుగుకు తక్కువలో తక్కువ రూ.50 వేసుకున్నా.. మూడువేల అడుగులకు రూ.లక్షన్నర అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇంకా రాయితీ మీదనే కొనసాగిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.