హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): వైద్య, ఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొ ఫెసర్ పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలొస్తున్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నది. అయితే, జీవో-154 ప్రకారం.. ప్రతి ఐదు ఖాళీల్లో మూడు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, ఒక పోస్టును ఇన్ సర్వీస్ అభ్యర్థుల ద్వారా (లాటరల్ ఎంట్రీ), మరో పోస్టును డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) నుంచి బదిలీల ద్వారా చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఆర్డర్‌ను తప్పనిసరిగా పాటించాలని గతంలో హై కోర్టు తీర్పు ఇచ్చింది. జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం పీజీ అయిన తర్వాత రెండేండ్లు సీనియర్ రెసిడెంట్‌గా పనిచేసిన వారే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పొందేందుకు అర్హులు.
అయితే, మల్టీ జోన్-1, మల్టీజోన్-2 పరిధిలో అనర్హులకు రాత్రికి రాత్రి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారని వైద్య సంఘాలు మండిపడుతున్నాయి. ఈనెల 25న సర్టిఫికెట్ల వెరిఫికెషన్ పేరిట పిలిచి 146 మందికి ఆగమేఘాల మీద పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టుకోవాలని కోరి.. పోస్టింగ్ ఆర్డర్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తేలాల్సి ఉన్నది. పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చిన వారిలో 37మంది మాత్రమే అర్హులని పలువురు అర్హులైన అభ్యర్థులు పేర్కొన్నారు. మరో 22 మందిని ప్రొవిజనల్ మెరిట్ లిస్టులోనే ‘నాన్ ఎలిజిబుల్’ అని ప్రకటించారని, వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం ఏమిటని వైద్య సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
వసూళ్లకు పాల్పడిన అధికారి
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి రాత్రికి రాత్రే నియామక ఉత్తర్వులు వెలువడటం వెనుక డీఎంఈలో ఏండ్లుగా పాతుకొనిపోయిన ఓ కింది స్థాయి అధికారి ఉన్నారనే ఆరోపణలున్నాయి. సదరు అధికారి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నాయి. దీనిపై అర్హులైన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడటంతో డీఎంఈ అధికారులు హుటాహుటిన నియామక ఉత్తర్వులు హోల్డ్ చేస్తున్నట్టు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఆగమేఘాల మీద పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడంపై వివరణ కోరేందుకు డీఎంఈ నరేంద్రకుమార్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా.. ఆయన స్పందించలేదు.