హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమ దందాలు, భారీ ఆర్థిక అవకతవకలు మార్కెటింగ్ శాఖను నీడలా వెంటాడుతున్నాయి. విచారణలపై విచారణలు, సస్పెన్షన్లపై సస్పెన్షన్లతో హాట్‌హాట్‌గా మారుతున్నది. ఈ వ్యవహారం ఇంతటితో ఆగేలా కనిపించడంలేదు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన కమిటీ ప్రభుత్వానికి సంచలన నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అక్రమాలతో సంబంధం ఉన్న అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని నివేదికలో సూచించినట్టు సమాచారం. అంతేకాకుండా ఇది భారీ ఆర్థిక కుంభకోణమని, ఏదైనా ప్రత్యేకమైన ఏజెన్సీతో విచారణ జరిపించాలని మరో కీలకమైన సిఫార్సు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. కీలక ఏజెన్సీ ద్వారా విచారణ జరిపిస్తే కొనుగోళ్లలో జరిగిన అవినీతి కూకటి వేళ్లతో సహా బయటపడుతుందని, మార్కెటింగ్ శాఖలోని చాలా మంది ఉద్యోగాలు ఊస్ట్ అవడం ఖాయమనే చర్చ ఆ శాఖలో జరుగుతున్నది.
ప్రత్యేక ఏజెన్సీతో విచారణ జరిపించాలంటూ కమిటీ తన నివేదికలో సిఫార్సు చేయడంతో ఇప్పుడిది మార్కెటింగ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. కమిటీ సిఫార్సును అమలు చేస్తారా? లేక పక్కన పెట్టేస్తారా? అనే చర్చ జరుగుతున్నది. అయితే, ప్రభుత్వం మాత్రం కమిటీ సిఫార్సులను అమలు చేయాలనే ఆలోచనలోనే ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వివాదంపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరిపించినందున ఇప్పుడు దీన్ని సీఐడీకి అప్పగించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి తెరవెనుక కసరత్తు కూడా జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారుల పాత్ర కూడా ఉన్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అదే విధంగా జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్‌కు చెందిన ఓ ఇద్దరు కీలక వ్యక్తుల్త పాత్ర కూడా ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా జిన్నింగ్ మిల్లులు, సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారులు అంతా కలిసి భారీ మొత్తంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ అధికారుల పాత్ర ఉన్నదనే ఆరోపణల నేపథ్యంలో ఈ అవినీతి భాగోతాన్ని సీబీఐకి సిఫార్సు చేసినా అశ్చర్యపోనవసరం లేదనే చర్చ మార్కెటింగ్ శాఖలో నడుస్తున్నది.
పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు మద్దతు ధర దక్కకుండా చేసి, వారి పేరుతో అక్రమంగా పత్తి విక్రయించి నిండా ముంచడాన్ని మంత్రి సీరియస్‌గా పరిగణించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరిపించడంతోపాటు మార్కెటింగ్ శాఖ ఉద్యోగులతో కమిటీ వేసి మరోసారి విచారణ జరిపించారు. ఈ రెండు విచారణల్లోనూ పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్టు బయటపడింది.
విజిలెన్స్, మార్కెటింగ్ శాఖ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పటికే వరంగల్ జేడీగా పనిచేసిన శ్రీనివాస్‌ను ప్రభుత్వం ఇటీవలే సస్పెండ్ చేసింది. అదేవిధంగా అంతకుముందే 118 మందికి మెమోలు జారీ చేయడంతోపాటు ఏడుగురు మార్కెటింగ్ కార్యదర్శులను సైతం సస్పెండ్ చేసింది. అయితే, తాజాగా జేడీ స్థాయి అధికారిని సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. త్వరలో మరికొంత మందిపై వేటు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతున్నది.
2024-25 సంవత్సరంలో రాష్ట్రంలో సీసీఐ సుమారు 21 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేసింది. అయితే కొనుగోళ్లలో సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, ఏఈవోలు అంతా కుమ్మక్కై రైతులను నిండా ముంచి భారీ మొత్తంలో దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. పంటల నమోదులో మిస్సయిన రైతులకు తమ పంట అమ్ముకొనేందుకు వీలుగా తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) జారీచేస్తారు. ఈ నిబంధనను అడ్డుగా పెట్టుకొని వీళ్లంతా కుమ్మక్కై భారీ మొత్తంలో నకిలీ టీఆర్‌లు జారీ చేసినట్టు విచారణలో తేలింది. వీటి ఆధారంగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేరుతో దళారులే భారీ మొత్తంలో పత్తిని విక్రయించారని తేలింది.
రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేసి మళ్లీ వారి పేరుతోనే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్టు తేలింది. ఇలా ఒక్కో క్వింటాల్‌పై కనీసం రూ.1,500 నుంచి రూ.2వేల వరకు దోచుకొన్నారనే ఆరోపణలున్నాయి. ఇందులో సీసీఐ అధికారులకు క్వింటాల్‌కు రూ.300 వరకు, మార్కెటింగ్ శాఖ అధికారులకు రూ.50 చొప్పున కమీషన్లు ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై రైతుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణకు ఆదేశించగా తీగలాగితే డొంక కదిలినట్టు.. మొత్తం అవినీతి బండారం బయటపడింది.