హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా భైంసా మండలం సిరాల గ్రామం వద్దగల ఏడువారాల గుహల్లో ఇనుప ఖనిజం ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. జీఎస్ఐ కూడా దీన్ని ఇనుప ఖనిజంగా నిర్థారించినట్టు తెలిపింది. గుట్ట ఏర్పడేటప్పుడు మాగ్మాటిక్ ఫార్మేషన్‌లోని వైవిధ్యం, వాతావరణ ప్రభావంవల్ల గుహలు సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. సుమారు అరకిలోమీటర్ వైశాల్యంలో విస్తరించివున్న ఇక్కడి గుట్టల్లో పొరలుపొరలుగా ఇనుప ఖనిజం తాలూకు ఆనవాళ్లు ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బలగం రామ్మోహన్ తెలిపారు. అక్కడి రాతి ముక్కలను జీఎస్ఐ విభాగానికి పంపగా, సంస్థ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల్‌రావు వాటిని పరిశీలించి బీఐఎఫ్ (బ్యాండెడ్ ఐరన్ ఫార్మేషన్)కు చెందిన ఇనుప ఖనిజం ఉన్నట్టు తెలిపారు. ఇవి 25 నుంచి 17 కోట్ల సంవత్సరాల మధ్యకాలంలో ఏర్పడినట్టు అంచనా వేశారు. గుట్టపై ఏడు గుహలు ఉండగా, పూర్వకాలంలో రుషులు ఇక్కడ తపస్సు చేసుకొనేవారని స్థానికులు తెలిపారు.