హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): వినూత్నమైన ఆలోచన, అందుకు తగిన యోగ్యత ఉన్న అంకుర సంస్థలకు పెట్టుబడి నిధులు లభించడం సమస్యే కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. తమ పెట్టుబడులకు నికర లాభాలు వస్తాయన్న భరోసా ఉన్న చోట తమ నిధులను వెచ్చించేందుకు గల అవకాశాల కోసం ప్రపంచంలో ఎంతోమంది ఎదురుచూస్తున్నారని తెలిపారు. టీహబ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అమెరికాకు చెందిన సీమాంతర పెట్టుబడుల సంస్థ డల్లాస్ వెంచర్ క్యాపిటల్ (డీవీసీ)ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఇండియా ఫండ్ పేరుతో టీహబ్‌లోని స్టార్టప్‌లకు డల్లాస్ వెంచర్ క్యాపిటల్ నిధులు సమకూర్చనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో డీవీసీ టీహబ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత్ ఆర్థికంగా అభివృద్ది చెందుతున్నదని, దేశానికి పెట్టుబడులు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయపడ్డారు. వినూత్నమైన ఆలోచన, సృజన ఉన్న స్టార్టప్‌లకు నిధుల కొరత ఉండబోదని అన్నారు. అయితే స్టార్టప్‌లను ఎలా నిర్వహిస్తారు? డబ్బు వృథా కాకుండా వ్యాపారాన్ని ఎలా వృద్ది చేస్తారనేదే ముఖ్యమైన అంశమని చెప్పారు.
దేశానికి ఆదర్శంగా టీ హబ్
ప్రారంభించిన ఏడాదిలోనే అద్భుత పనితీరుతో టీహబ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ కొనియాడారు. కొత్త స్టార్టప్‌లకు టీ హబ్ చిరునామాగా మారిందని, భారత్‌లో మొదటి ప్రైవేటు రాకెట్ టీ హబ్ నుంచే వచ్చిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో స్టార్టప్‌లు వస్తున్నాయని, హైదరాబాద్‌లోనే సుమారు ఆరు వేల స్టార్టప్‌లు ఉన్నాయని తెలిపారు. ‘ధ్రువ స్పేస్’ సంస్థ హైదరాబాద్ నుంచి వచ్చి మొదటి ప్రయోగంలోనే నానో రాకెట్స్‌ని విజయవంతంగా నింగిలోకి పంపిందని పేర్కొన్నారు. డల్లాస్ వెంచర్ క్యాపిటల్ సంస్థ భారత్‌లో అనేక స్టార్టప్‌లను నెలకొల్పిందని, భారత్‌లో 25 వేల ఉద్యోగాలు కల్పించాలన్న ఆ సంస్థ ఆలోచన గొప్పదని ప్రశంసించారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక స్టార్టప్‌లకు సహాయం: డీవీసీ మేనేజింగ్ డైరెక్టర్ దయాకర్ ఆర్ పుస్కూర్
డల్లాస్ వెంచర్ క్యాపిటల్ ప్రపంచవ్యాప్తంగా అనేక స్టార్టప్‌లకు సహాయకారిగా ఉన్నదని డీవీసీ మేనేజింగ్ డైరెక్టర్ దయాకర్ ఆర్ పుస్కూర్ చెప్పారు. బీ2బీ భారత్‌లో రూపొందించిన స్టార్టప్ అని తెలిపారు. టీహబ్ సీఈవో శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ స్టార్టప్‌లను, వాటి వ్యాపారాన్ని విస్తృతపర్చేందుకు టీహబ్‌తో భాగస్వామ్యం దోహదపడుతుందని అన్నారు. తమ సంస్థ ఇప్పటికే కొత్త పోర్ట్‌ఫోలియో కంపెనీలతో కలిసి పనిచేస్తున్నదని చెప్పారు. గ్లోబల్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినూత్న సాంకేతికతను రూపొందించడానికి తమవంతు కృషిచేస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, డీవీసీ కో-ఫౌండర్ అబిద్ అలీ నీముచ్వాలా, శ్యామ్ పెనుమాక, గోకుల్ దీక్షిత్ పాల్గొన్నారు.