మంచిర్యాల అర్బన్, జూలై 24: కొందరు అత్యాశకుపోయి ఓ యాప్లో పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాటామీర్ అనే ఆన్లైన్ యాప్ (వడ్డీ యాప్) ద్వారా లింకులు రావడంతో మంచిర్యాలకు చెందిన దాదాపు 800 మంది అందులో చేరారు. పెట్టిన డబ్బులకు రెట్టింపు వడ్డీలు ఇస్తామంటూ నిర్వాహకులు ఏరోజుకారోజు ఆఫర్లు పెడుతూ ఆకర్షించారు.
ఇందుకు ఆశపడిన అనేక మంది పెట్టుబడులు పెట్టారు. నిర్వాహకులు సైతం వారి పెట్టుబడికి తగ్గట్లుగా వడ్డీ రూపంలో డబ్బులు జమ చేస్తూ వచ్చారు. ఇలా నాలుగు నెలలుగా వ్యవహారం బాగానే నడిచింది. గత శుక్రవారం ఎన్ని డబ్బులు పెడితే.. బదులుగా అన్ని డబ్బులు తిరిగి చెల్లిస్తామని నిర్వాహకులు ఆఫర్ ఇవ్వడంతో అనేక మంది పుస్తెలతాళ్లు అమ్మి మరీ పెట్టుబడులు పెట్టారు. సోమవారం నుంచి డబ్బులు విత్డ్రా కాకపోవడంతో ఆందోళన చెందిన బాధితులు బుధవారం స్థానిక పోలీస్స్టేషన్ మెట్లెక్కారు. సీఐ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు.