హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : దావోస్ వేదికగా తాము సాధించుకొచ్చామని కాంగ్రెస్ చెబుతున్న అమెజాన్ రూ.60 వేల కోట్ల డాటా సెంటర్ పెట్టుబడులకు 2020లోనే బీజం పడినట్టు రాష్ట్ర టెక్నాలజీస్ సర్వీసెస్ సంస్థ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు తెలిపారు. ఈ పెట్టుబడులు సాధించడంలో కాంగ్రెస్ కృషి ఏమీ లేదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1.70 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెబుతున్నదని, కానీ 2020 లో నాటి సీఎం కేసీఆర్ హ యాంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటుకు చొరవ చూపినట్టు తెలిపారు.
తెలంగాణలో కంపెనీ ఏర్పాటుతో కలిగే లాభాలను కంపెనీ ప్రతినిధులకు వివరించి చెన్నై, ముంబై, నొయిడా, అహ్మదాబాద్, గుర్గావ్లకు తరలిపోకుండా కేటీఆర్ కృషి చేసినట్టు గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలోనే మీర్ఖాన్పేటలో 48 ఎకరాల్లో 4 వేల మంది ఉద్యోగులతో అమెజాన్ డాటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటుచేసిందని, అప్పుడే మూడు నుంచి నాలుగేండ్లలో మరో డాటా సెంటర్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.