హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఏపీ రాష్ట్ర విభజన సందర్భంగా ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపునకు ఏర్పాటుచేసిన ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ మార్గదర్శకాల మేరకే విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ క్యాడర్ వివాదంపై జనవరిలో చీఫ్ జస్టిస్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు సందర్భంగా కమిటీ మార్గదర్శకాలను ధర్మాసనం సమర్థించింది. ఈ మార్గదర్శకాల మేరకు తమ ముందు న్న వ్యాజ్యాలను కూడా విచారణ చేస్తామని జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం సోమవారం స్పష్టంచేసింది. డీజీపీ అంజనీకుమార్ సహా క్యాడర్ వివాదం ఎదురొంటున్న అధికారులు క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు. గత జనవరిలో తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను మరో బెంచ్‌కు బదిలీ చేశారు. వీటిని సోమవారం జస్టిస్ అభినంద్ కుమార్ షావిలీ, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదిస్తూ, పిటిషన్లపై సత్వరమే విచారణ పూర్తి చేయాలని కోరగా, 10 ఏండ్లుగా ఎందుకు మిన్నకుండిపోయారని హైకోర్టు ప్రశ్నించింది. ఒకసారిగా వేగంగా జరగాలని కోరడం సబబు కాదని తెలిపింది. విచారణను డిసెంబర్ 4 నుంచి రోజువారీ విచారణ చేస్తామని ప్రకటించింది.