హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ (BRS) గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో (Congress) చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ సోమవారం ప్రారంభమైంది. అయితే.. స్పీకర్ న్యాయ సలహాదారు నియామకంపై వివాదం మొదలైనట్టు సమాచారం. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదినే స్పీకర్ తన న్యాయ సలహాదారుడిగా నియమించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ కేసులో ఎవరికి న్యాయం జరగాలో సదరు న్యాయవాది మానసికంగా ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారని, దానికి అనుగుణంగానే స్పీకర్‌కు న్యాయ సలహాలు, సూచనలు చేసే అవకాశం ఉన్నదని వారు ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇలాంటి వాతావరణంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఎలా కలుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులను ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమ అభ్యంతరాలను వారు ఫిర్యాదురూపంలో శాసన సభ కార్యదర్శికి అందించినట్టు తెలిసింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలను స్పీకర్ ఓపికగా విన్నారని తెలిసింది.
నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ కోర్టు ముందు హాజరయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తమ న్యాయవాది శరత్‌తో కలిసిరాగా, పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అడ్వకేట్ వెంకటేశ్‌తో, గద్వాల్ ఎమ్మెల్యే లా ఫోరం అడ్వకేట్‌తో కలిసి విచారణకు హాజరు అయినట్టు సమాచారం. మహిపాల్‌రెడ్డి, కాలె యాదయ్యపై సంగారెడ్డి ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మీద పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్ మీద డాక్టర్ సంజ య్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాత్రి 7 గంటల వరకు విచారణ కొనసాగినట్టు సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి తరుచూ మీడియాతో మాట్లాడిన మాటలనే ఫిరాయింపు ఎమ్మెల్యేల న్యాయవాదులు సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇటీవల రేవంత్ ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో ప్రస్తావించిన విషయాలనే న్యాయవాదులు ప్రశ్నలుగా అడిగినట్టు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి సీఎం మాట్లాడిన మాటలను, న్యాయవాదులు అడగాల్సిన ప్రశ్నావళిని సలహాదారుడిగా ఉన్న న్యాయవాదే రూపొందించినట్టు తెలిసింది.
‘కండువా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్టా? అభివృద్ధి పనుల కోసం సీఎంను కలవవచ్చు కదా? మీరు కలువరా? ఆయన ఇంటికి వెళ్లినప్పుడు సీఎం ఏ కండువా కప్పుతారో ఏం తెలుస్తుంది?’ అని ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు అడిగినట్టు సమాచారం. ముగ్గురు అడ్వకేట్లు, ముగ్గురు ఫిర్యాదుదారులను వేర్వేరు సందర్భాల్లో ఇవే ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. వారికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భిన్న కోణాల్లో ధీటుగా సమాధానం చెప్పినట్టు తెలిసింది. కండువా కప్పుకోవడం మాత్రమే కాదని, వారి భౌతిక ప్రవర్తన కూడా కాంగ్రెస్‌కు అనుగుణంగానే ఉన్నదని చెప్పినట్టు తెలిసింది. నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినప్పుడు వారి చుట్టూ ఉన్న పరిసరాలు, ఆ పరిసరాల్లో ఉన్న నాయకులను కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుందని ఫిర్యాదుదార్లు సూచన చేసినట్టు తెలిసింది. కాలె యాదయ్య ఢిల్లీకి వెళ్లి మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆ సమయంలో ఆయన వెంట సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, అప్పటి ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్మున్షీ తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారని చెప్పారట. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్పింగ్‌లు, పత్రికా ప్రతులు వారికి అందజేసినట్టు తెలిసింది. కాలె యాదయ్య తన నియోజకవర్గంలో క్యాడర్‌ను టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ మారిన కార్యకర్తలకు చెయ్యి గుర్తుతో కూడిన కండువాలు కప్పారని వివరించినట్టు సమాచారం. దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా వారు స్పీకర్ కోర్టుకు అందించినట్టు తెలిసింది.
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన సీట్లలో కాకుండా ప్రత్యేక సీట్లలో కూర్చున్నారని, పార్టీ లెజిస్లేచర్ సమావేశాలకు కూడా వారు హాజరు కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తమ పార్టీ అధ్వర్వంలో చేపట్టిన నిరసనలు, ధర్నాలలో వారు పాల్గొనలేదని చెప్పినట్టు తెలిసింది. అన్నిటికీమించి తమ పార్టీ 25 వసంతాల సిల్వర్ జూబ్లీ సభకు కూడ ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరించినట్టు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశాలకు వీరు హాజరయ్యారనే విషయాన్ని స్పీకర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిసింది. పఠాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పార్టీ మారిన తరువాత కాంగ్రెస్‌కు సంబంధించిన స్థానిక లీడర్లతో గొడవలు జరిగాయని, ఈ గొడవల నేపధ్యంలో ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరయ్యారని స్పీకర్ కోర్టుకు విన్నవించినట్టు తెలిసింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరటాన్ని మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసిందని, అవే కాపీలను స్పీకర్ కార్యాలయానికి కూడా అందించానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పష్టంగా వివరించినట్టు తెలిసింది. ఫిర్యాదుదార్లు ఇచ్చిన ఛాయాచిత్రాలు, వీడియో క్లిప్పింగుల విశ్వసనీయతపై ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు అనుమానం వ్యక్తంచేస్తూ.. ఇవి మార్ఫింగ్ చేసిన ఫోటోల్లా ఉన్నాయనగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రిమినల్ ఆలోచనతో చేసే పని అది, మార్ఫింగ్ అనుమానం ఉన్నప్పుడు మీరు క్రిమినల్ కేసులకు ఏమై నా సిఫారస్ చేశారా? అని బదులిచ్చినట్టు తెలిసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ పార్టీలోనే ఉన్నారని అనేక సందర్భాల్లో సీఎం, మంత్రులు అసెంబ్లీలోనే చెప్పినట్లు వివరాలు అందించినట్టు తెలిసింది.
‘మీరు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల బ్యాంకు అకౌంట్ నుంచి నెలనెలా రూ.5వేల చొప్పున బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం అకౌంట్లో పడుతున్నాయి కదా? అటువంటప్పుడు పార్టీ ఫిరాయింపు ఎలా అవుతుంది?’ అని ఫిరాయింపుదార్ల తరఫు న్యాయవాదులు పదే పదే అడిగినట్టు తెలిసింది. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బదులిస్తూ.. ఎల్పీ కార్యాలయం ఖర్చులకు ఎమ్మెల్యేలు నిధులు ఇవ్వటం అనేది పూర్తిగా వ్యక్తిగతమని, తాము ఎమ్మెల్యేలుగా గెలిచిన మొదట్లోనే ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వాలని అనుకున్నామని, కానీ కచ్చితంగా ఇవ్వాలనేది లేదని చెప్పినట్టు తెలిసింది. పార్టీపరంగా ఇప్పటివరకు చర్యలేమైనా తీసుకున్నారా? అని న్యాయవాదులు అడుగగా.. ఫిరాయింపుదారులు తమ పార్టీలోనే లేనప్పుడు వారిపై పార్టీపరమైన చర్యలు ఏముంటాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారటం అనైతికమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే కోరుతున్నామని, డిస్క్వాలిఫై చేయాలని అడుగుతున్నా కదా అని ఫిర్యాదుదారులు చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై తమకు వ్యక్తిగత రాగద్వేషాలు ఏమీలేవని, పార్టీ ఫిరాయించారు కాబట్టే శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని న్యాయవాదుల ప్రశ్నకు బదులిచ్చినట్టు తెలిసింది. తిరిగి ఫిర్యాదుదారులు, ఫిరాయింపుదార్లు, వారి తరఫు న్యాయవాదులు అక్టోబర్ 1న మరోసారి విచారణకు రానున్నారు. ఆ రోజున ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాదులు క్రాస్‌ఎగ్జామిన్ చేయనున్నారు.