హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ పరీక్షలను తిరిగి నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా యూనివర్సిటీ పరీక్షలను నిర్వహించిందని, 5 గ్రేస్ మార్కులు ఇవ్వాలని పిటిషనర్లు కోరగా ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. జాతీయ మెడికల్ కమిషన్-2019 నాటి నిబంధనలకు అనుగుణంగా ఎంబీబీఎస్ పరీక్షలను నిర్వహించకపోవటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్లను డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. గ్రేస్ మార్కులు ఇవ్వాలో లేదో నిర్ణయించే అధికారం యూనివర్సిటీకే ఉంటుందని స్పష్టం చేశారు. విచక్షణాధికారం పేరుతో విద్యాసంబంధ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పారు. అసాధారణ పరిస్థితుల్లోనే ఆ అధికారాలను వినియోగిస్తామని పేర్కొన్నారు. రాత పరీక్షల మూల్యాంకనాన్ని డిజిటల్ విధానంలో చేయటంతో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయామని విద్యార్థులు నిరూపించలేకపోయారని హైకోర్టు తప్పుపట్టింది. వాదన వాస్తవమని అనుకొంటే రివ్యాల్యుయేషన్కు ఎందుకు దరఖాస్తు చేయలేదని ఆక్షేపించింది. ప్రధాన పరీక్షలే కాకుండా సప్లమెంటరీ పరీక్షల్లో ఫెయిలయ్యాక కోర్టుకు రావడాన్ని బట్టి వారి వాదన సరికాదని తేల్చింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకొనే ఆస్కారమే లేదని తీర్పులో పేర్కొన్నది.