హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): స్టాక్ మారెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను అరెస్ట్ చేసినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) డీజీ శిఖాగోయెల్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఆగస్టులో ఆరోహి పేరుతో ఉన్న వాట్సాప్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ గ్రూప్‌లో ఆహ్వానం అందింది. ‘305 స్టాక్ మారెట్ న్యూస్’ అనే గ్రూప్‌లో ఐపీవోలు, ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. బాధితుడు తొలుత రూ.50,000 పెట్టుబడి పెట్టగా స్రీన్‌పై లాభాలు కనిపిస్తుండటంతో వారి మాటలు నమ్మి 50 రోజుల్లో రూ.3,49,20,004 పెట్టుబడిగా పెట్టాడు.
డబ్బు విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా, సర్వీస్ చార్జీల పేరుతో మరిన్ని డబ్బులు డిమాండ్‌చేశారు. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సీఎస్బీ అధికారులు ఆ డబ్బులు ‘తనిష్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఉన్న కరెంట్ అకౌంట్‌కు మళ్లినట్టు గుర్తించి, కరీంనగర్‌కు చెందిన వట్టి మైఖేల్రెడ్డిని అరెస్ట్ చేశారు. దుబాయ్‌లో సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిన ఆవుల శ్రీనివాస్ రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులతో చేతులు కలిపి ఈ ముఠా నడిపించాడని తెలిపారు. ఈ కేసులో కీలకంగా ఉన్న సతీశ్‌కుమార్, రాజేందర్‌ను అరెస్ట్ చేశారు. దుబాయ్‌లో పరిచయమైన స్నేహితుల ద్వారా శ్రీనివాస్ ఈ దందా ప్రారంభించినట్టు ఒప్పుకున్నారు. వీరు రూ.6.29 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్టు, 94 ఫిర్యాదులు ఉన్నట్టు గుర్తించారు. నిందితుల నుంచి 4 ఫోన్లు, 2 చెక్ బుక్‌లు, 3 డెబిట్/క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.