Power Cut | హైదరాబాద్ సిటీబ్యూరో,ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు రోజుకో సమస్య వస్తున్నది. ఇప్పటివరకు బల్లి, తొండ, ఉడుత విద్యుత్ అంతరాయానికి కారణం కాగా ఈసారి ఉడుము వంతొచ్చింది. బోడుప్పల్ సమీపంలోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్( సీపీఆర్ఐ) ప్రాంగణంలోని ఒక బాక్సులోని బ్రేకర్లోకి ఉడుము వెళ్లడంతో పీఅండ్‌టీ కాలనీ 11కేవీ ఫీడర్ ట్రిప్ అయింది. దీంతో ఆ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
4-5 నిమిషాలపాటు ఆ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని, వెంటనే ఉప్పల్ ఫీడర్ పరిధి నుంచి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని హబ్సీగూడ సర్కిల్ ఎస్ఈ పీ బ్రహ్మం తెలిపారు. విద్యుత్ పరిశోధన కేంద్రమైన సీపీఆర్ఐలోనే ఈ ఘటన జరగడంతో లోపల విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిందని, దాన్ని అక్కడి అధికారులు గుర్తించి సరిచేస్తున్నారని తెలిపారు.