హైదరాబాద్, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుపై అమెరికాలో ఆ దేశపు దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీచేసింది. ఈ నోటీసును రద్దు చేయాలంటూ కేవీపీ దాఖలు చేసిన పిటిషన్లో తెలంగాణ సరార్ను ప్రతివాదిగా చేర్చారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. తాము కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో అందుకు జస్టిస్ ఎన్ తుకారాంజీ అనుమతిచ్చారు. టైటానియం లీజులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్విట్జర్లాండ్‌కు చెందిన బౌత్లీ ట్రేడ్ ఏజీ కంపెనీతో కుదుర్చుకున్న ఎంవోయూ వెనుక కుట్ర ఉన్నదంటూ ఎఫ్‌బీఐ అమెరికా కోర్టులో కేసు పెట్టింది. ఈ క్రమంలో 2014 ఏప్రిల్ 28న అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీచేసింది. దీనిని రద్దు చేయాలంటూ కేవీపీ అప్పట్లో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. సీబీఐ తరఫు న్యాయవాది టీ సృజన్‌కుమార్‌రెడ్డి వాదిస్తూ, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చు తూ కేవీపీ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. దీనిపై హోంశాఖ తరఫు న్యాయవాది స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతివాదిగా చేర్చడం సరికాదని అన్నారు. ఈ మేరకు కౌం టర్ దాఖలు చేస్తామని చెప్పడంతో జూన్ 17కు వాయిదా పడింది.