హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సచివాలయంలో గురువారం ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో వివిధ శాఖల కార్యాలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు స్తంభించాయి. కొన్ని శాఖల్లో సేవలు పూర్తిగా నిలిచిపోగా, మరికొన్ని శాఖల్లో అంతరాయం ఏర్పడింది. ఇంటర్నెట్ లేకపోవడంతో వివిధ శాఖలకు చెందిన పలువురు ఉద్యోగులు పైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సేవల పునరుద్ధరణకు సాంకేతిక బృందం చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో కేబుళ్లను తొలగించడంతోనే సచివాలయంలోనూ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగి ఉండొచ్చని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి.