హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయి న్యాయ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనున్నది. సెప్టెంబర్ 16, 17న ఈ సదస్సు నిర్వహించనున్నట్టు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ జ్యూరిస్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆదిష్ సీ అగర్వాల్ ప్రకటించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ..
ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 100 మంది న్యాయమూర్తులు, 100 మంది భారతీయ న్యాయమూర్తులతోపాటు అన్ని రాష్ట్రాల హైకోర్టు బార్ అసోసియేషన్లు, బార్ కౌన్సిళ్ల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో ఈ సదస్సును నిర్వహించనుండటంపై అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెచ్ సీఏఏ మాజీ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్, ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్‌రావు, కార్యదర్శులు పులి దేవేందర్, కే ప్రదీప్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ బైరెడ్డి, కార్యవర్గ సభ్యులు నాగులూరి కృష్ణకుమార్‌గౌడ్, చైతన్య లత తదితరులు పాల్గొన్నారు.