హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు కొందరు సీనియర్ మండల పరిషత్ అధికారులు (ఎంపీవోలు) కొత్త భాష్యం చెప్పారు. ఈ బదిలీలను ముందే ఉహించి అంతర్గత బదిలీలతో సర్దుకున్నారు. మల్టీ జోన్ పోస్టులకు సంబంధించిన బదిలీల నుంచి తప్పించుకొని తమకు అనువైన చోట తిష్ఠవేశారు. మల్టీ జోన్ పోస్టుల్లో ఉన్న వీరు వివిధ కారణాలను చూపి ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లోనే ఇతర మండలాల్లోకి బదిలీ చేయించుకున్నారు. దీంతో ప్రస్తుత సాధారణ బదిలీల్లో జూనియర్ ఎంపీవోలు అన్యాయానికి గురవుతున్నారు. వారంతా ఇతర జిల్లాలకు, మారుమూల ప్రాంతాలకు బదిలీ కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సీనియార్టీ జాబితా ఆధారంగా ఎంపీవోలను బదిలీ చేయాలి.. దీంతో ముందు సీనియర్లనే బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం బదిలీలకు అర్హులైన ఎంపీవోల జాబితాలో నల్లగొండ జిల్లాకు చెందిన ఒక్కరు కూడా లేరు. ఆ జిల్లాలో నిరుడు ఫిబ్రవరిలోనే అంతర్గత బదిలీలు చేపట్టడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఇదే తరహాలో భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, నారాయణపేట, జగిత్యాల, ములుగు, హనుమకొండ, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోనూ అంతర్గత బదిలీలు జరిగినట్టు గుర్తించారు. దీంతో 5 నుంచి 8 ఏండ్ల సీనియార్టీ ఉన్న ఎంపీవోలు ప్రస్తుత సాధారణ బదిలీల జాబితాలో లేకుండా పోయారు. కేవలం 4 ఏండ్ల నుంచి సర్వీస్‌లో కొనసాగుతున్న జూనియర్ ఎంపీవోలను మాత్రమే ఈ జాబితాలో చేర్చారు. దీనిపై జూనియర్ ఎంపీవోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన అంతర్గత బదిలీలను రద్దుచేసి, సీనియార్టీ ప్రకారం బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): సాంకేతిక కళాశాల, ఇంటర్ కళాశాలల్లోని ఉద్యోగులు, సిబ్బందిని వెబ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నది.