హైదరాబాద్, డిసెంబర్ 16 ( నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల సెంటర్లను ఇంటర్‌బోర్డు కుదించింది. ఈ ఏడాది 50 వరకు సెంటర్లను తగ్గించింది. నిరుడు 1,533 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఈ సారి 1,488 సెంటర్లకే పరిమితం చేసింది. ఇది వరకు మిక్స్డ్ ఆక్యుపెన్సీ సమస్యతో ఆయా కాలేజీల్లో సెంటర్లు కేటాయించలేదు. దీంతో సమీపంలోని స్కూళ్లల్లో సెంటర్లు వేసేవారు. ఈ సారి మిక్స్డ్ ఆక్యుపెన్సీ జంజాటానికి తెరపడింది. స్కూళ్లల్లో సెంటర్లు వేయాల్సిన అవసరం రాలేదు. దీంతో సెంటర్ల సంఖ్య తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 9.7లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఈ సంఖ్య పెరిగితే నాలుగైదు సెంటర్లు పెరుగుతాయని అధికారులు అంటున్నారు.
ఇంటర్ నామినల్ రోల్స్, వ్యక్తిగత వివరాల్లో ఇంకా తప్పులు వెలుగుచూస్తున్నాయి. పలుమార్లు అవకాశం ఇచ్చినా ఇంకా తప్పులు బయటపడుతున్నాయి. ఈసారి నామినల్రోల్స్లో తప్పులు లేకుండా ఉండేందుకు ఇంటర్‌బోర్డు చర్యలు తీసుకున్నది. మొదట విద్యార్థుల ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్లు పంపించారు. మీరు తీసుకున్న గ్రూప్ ఇది. సబ్జెక్టులు ఇవి. మీడియం, రెండో భాష ఇది అంటూ మొబైల్స్‌కు ఎస్ఎంఎస్లు పంపించారు. ఆ తర్వాత పలుమార్లు నామినల్ రోల్స్‌ను సవరించుకునే అవకాశం కల్పించారు. ప్రిన్సిపాళ్లను అప్రమత్తం చేశారు. కొంత మంది మాత్రమే ఈ అవకాశాన్ని వాడుకున్నారు. తీరా పది రోజుల క్రితం ప్రిన్సిపాళ్లు తమ కాలేజీ విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పులు లేవని డిక్లరేషన్ ఇవ్వాలి అని ఆదేశించారు. దీంతో ఈ వారంలోనే వందల సంఖ్యలో తప్పులు ఉన్నట్టు ప్రిన్సిపాళ్లు గుర్తించి, సవరించాలని కోరడం గమనార్హం. పరీక్షలు సమీపిస్తున్నా ఇంకా అనేక తప్పులు వెలుగుచూస్తుండటం అధికారులను కలవరపెడుతున్నది.
కొందరు రెండో భాషగా అరబిక్/ఉర్దూ ఎంచుకుంటున్నారు. తెలుగు/సంస్కృతం ఎంపిక చేసుకుంటున్నారు. తీరా పరీక్షకు వచ్చిన తర్వాత సబ్జెక్టు ఇది కాదని మరో సబ్జెక్టు అని ఆ పేపర్ పరీక్షరాస్తున్నారు. దీంతో కొన్ని సబ్జెక్టు పేపర్లు తక్కువగా ఉండగా, మరికొన్ని ఎక్కువగా ఉంటున్నాయి. హాల్‌టికెట్‌లో ఒక సబ్జెక్టు ఉంటే పరీక్ష రాసింది మరో సబ్జెక్టు ఉంటున్నది. దీంతో ఫలితాల సమయంలో ఇబ్బందులు వస్తున్నాయి.
మొదట కొందరు విద్యార్థులు ఎంపీసీలో అడ్మిషన్ తీసుకుంటున్నారు. కొన్నాళ్లకు సీఈసీ గ్రూపునకు మారుతున్నారు. తీరా చూస్తే ఎంపీసీకి హాల్‌టికెట్ జారీ అవుతుంది. చివరికి పరీక్ష సమయంలో లబోదిబో అంటున్నారు.
ఎస్సెస్సీ సర్టిఫికెట్లలో పేరు ఒకలా ఉంటే, విద్యార్థి పేరును మరోలా నమోదు చేస్తున్నారు. ఇంటిపేరు, విద్యార్థి పేరులో తప్పులు ఉంటున్నాయి. తీరా హాల్‌టికెట్ జారీ అయ్యాక మార్చాలంటూ కోరుతున్నారు.
ఇటీవలీ కాలంలో చైతన్య అనే పేరు, అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికి ఉంటున్నాయి. ఓ కాలేజీ నిర్వాహకులు అమ్మాయికి బదులు అబ్బాయి అని నమోదు చేశారు. దీంతో అవస్థలు పడి మార్చుకోవాల్సి వచ్చింది.
మీడియం విషయంలో తెలుగుకు బదులు ఇంగ్లిష్, ఉ ర్దూకు బదులు తెలుగు మీడియం అని నమోదు చేస్తున్నారు. సర్టిఫికెట్లు జారీ అ య్యాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
వార్షిక పరీక్షల్లో ఈసారి బ్లాంక్/ఖాళీ ఓఎమ్మార్షీట్లు ఇవ్వబోమని ఇంటర్‌బోర్డు వర్గాలు స్పష్టంచేశాయి. ఎట్టి పరిస్థితుల్లో బ్లాంక్ ఓఎమ్మార్షీట్లు ఇవ్వబోమని ప్రకటించాయి. విద్యార్థి వివరాల్లో ఏవైనా తప్పులు జరిగితే, పరీక్ష రోజు ఆ విద్యార్థులకు బ్లాంక్ ఓఎమ్మార్ షీట్స్ ఇచ్చేవారు. కానీ ఈ సారి ఇవ్వముగాక ఇవ్వమని అంటున్నాయి. తప్పులు జరుగకుండా ముందే అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, కావున ఎట్టి పరిస్థితిలో బ్లాంక్ ఓఎమ్మార్ షీట్లు ఇవ్వబోమని అంటున్నాయి. కావున మరోసారి తప్పులు సరిచూసుకోవాలని సూచిస్తున్నారు.