హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నమోదు చేసిన కేసులో నిందితుడు గాదె ఇన్నయ్యకు తెలంగాణ హైకోర్టు 2 నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ కోసం ఇన్నయ్య జైలు వెలుపల ఉండాల్సిన అవసరం ఉందన్న వైద్యుల సూచనల మేరకు కఠిన షరతులతో బెయిల్‌కు అనుమతించింది. ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
జూన్ 5 నుంచి ఆగస్టు 4 వరకు ఇన్నయ్య కూకట్పల్లి శుభోదయ కాలనీలోని తన కుమార్తె నివాసంలోనే ఉండాలని ఆదేశించింది. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, సాక్షులను ప్రత్యక్షంగా లేదా ఫోన్ ద్వారా సంప్రదించరాదని, దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. నిందితుడి నివాసంపై నిఘా ఉంచేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించుకోవచ్చని దర్యాప్తు అధికారికి అనుమతిచ్చింది. ఇన్నయ్యతో ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, ముగ్గురు సోదరీమణులు మాత్రమే ఉండాలని పేరొన్నది.