JNTU | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : త్వరలోనే నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో కొత్త కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు జేఎన్టీయూ దృష్టిసారించింది. కొత్తగా అగ్రికల్చర్ టెక్నాలజీ, రేడియేషన్ ఫిజిక్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నీటి వసతి మెరుగై, సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ క్రమంలో వ్యవసాయ యాంత్రీకరణకు పరిశ్రమలను ప్రోత్సహించడమేగాక ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అగ్రికల్చర్ టెక్నాలజీ కోర్సుకు రూపకల్పన చేసింది. అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో అనేక అద్భుతాలను సృష్టిస్తున్నది. కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది. ఈ నేపథ్యంలో వీటికి అవసరమయ్యే నిపుణుల తయారీకి రేడియేషన్ ఫిజిక్స్ కోర్సును ప్రవేశపెట్టాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.
త్వరలో జేఎన్టీయూలో అగ్రికల్చర్ టెక్నాలజీ కోర్సు
వ్యవసాయ రంగంలో యంత్ర సామగ్రి పెద్దఎత్తున అవసరం పడుతుంది. దాంతో వ్యవసాయ ఉపకరణాలను, యంత్ర సామగ్రిని తయారు చేసే నిపుణుల శిక్షణకు అగ్రికల్చర్ టెక్నాలజీ అనే కొత్త కోర్సును జేఎన్టీయూ మంథని క్యాంపస్‌లో అధికారులు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ తరహా కోర్సును ఏపీ భీమవరంలోని ఓ కాలేజీలో నిర్వహిస్తున్నారు.
కూకట్పల్లి క్యాంపస్‌లో ఇంటర్ డిసిప్లినరీ కోర్సు
జేఎన్టీయూ కూకట్పల్లి క్యాంపస్‌లో కొత్తగా గోల్డెన్ జూబ్లీ భవనాన్ని నిర్మించనుండగా, ఇందులో ఇంటర్ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ కోర్సుల్లో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ విద్యార్థులు చేరేలా చర్యలు చేపడుతున్నారు.
రేడియేషన్ ఫిజిక్స్ కోర్సుకు అధికారుల నిర్ణయం
రాష్ట్రంలో రేడియేషన్ ఫిజిక్స్ కోర్సును ప్రస్తుతానికి ఓయూలోనే నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులో గరిష్ఠ సీట్ల సంఖ్య 9 మాత్రమే. కార్పొరేట్ దవాఖానల్లో సీటీ స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసే నిపుణులు ఈ కోర్సును పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ కోర్సును జేఎన్టీయూ కూకట్పల్లి క్యాంపస్‌లో ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.
రెండు క్యాంపస్‌లలో ఎంసెట్‌తో ఆరు కోర్సులు
వచ్చే విద్యాసంవత్సరంలో ఖమ్మం, మహబూబాబాద్‌లలో రెండు జేఎన్టీయూ క్యాంపస్‌లు ప్రారంభించనున్నారు. వీటిల్లో సీఎస్ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ, మైనింగ్ వంటి 6 కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ కోర్సుల్లో సీట్లను ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తారు.