హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్పీ).. విద్యాబోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం ఇది. ట్యాబ్లు, స్మార్ట్ఫోన్ల మాదిరిగానే వీటి ద్వారా కూడా సులభంగా పాఠ్యాంశాలను బోధించవచ్చు. అనేక కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు వీటిని ఉపయోగిస్తున్నాయి. కానీ, సర్కారు స్కూళ్లు మాత్రం ఉదాసీనతతో అందుబాటులో ఉన్న డిజిటల్ పరికరాలను వినియోగించకుండా మూలకు పడేశాయి. ఫలితంగా సర్కారు స్కూళ్లల్లో డిజిటల్ విద్యాబోధన అటకెక్కింది.
కరోనా తర్వాత డిజిటల్ బోధన విస్తృతమైంది. ఈ నేపథ్యంలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ సర్కారు డిజిటల్ విద్యకు ప్రాధాన్యమిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా 8, 9, 10వ తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలకు మూడు చొప్పున 5,172 స్కూళ్లకు ఐఎఫ్పీలను అందజేసింది. ఒక్కో ఐఎఫ్పీను రూ.3 లక్షలకుపైగా వెచ్చించి కొనుగోలు చేయగా.. పాఠశాలల నిర్లక్ష్యం కారణంగా అవి నిరూపయోగంగా మారాయి.