మహబూబ్నగర్, ఆక్టోబర్ 13: ‘నాన్న నేను ఇక్కడ చదవలేను.. నేను మన ఊరికి వచ్చి చదువుకుంటూ’.. అంటూ లేఖ రాసిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో చోటు చేసుకున్నది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రానికి చెందిన నాగేశ్, పద్మమ్మకు ఐదుగురు ఆడపిల్లలు . మూడో కూతురు ప్రియాంక (16)కు అదే మండలంలోని గురుకులంలో ఇంటర్ సీటు రాగా అక్కడ విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఉన్నారని.. మహబూబ్నగర్ జిల్లా రాంరెడ్డిగూడెంలోని గురుకుల కళాశాలలో ఎంపీసీలో చేర్పించా రు.
కొన్ని రోజులకే ‘ఇక్కడ బాగాలేదు.. నేను చదువుకోను.. మన ఊరి వద్దే ఉంటూ చదువుకుంటా’..? అని తండ్రికి ఫోన్ చేసినట్టు తెలిసింది. ఇంతలోనే ఏమైందో కాని సోమవారం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోని బాత్రూంలో చున్నీతో ఉరేసుకొన్నది. వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. కలెక్టర్ విజయేందిరబోయి దవాఖానకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఖాదర్ అనే యువకుడు తమ బిడ్డను వేధించడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.