TSBIE | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు( Inter Board ) వెబ్సైట్లో విద్యార్థుల హాల్ టికెట్లు( Hall Tickets ) అందుబాటులో ఉంచినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. అయితే నిన్నటి వరకు కేవలం ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసే వెసులుబాటు కల్పించారు. చాలా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు ఇంటర్ బోర్డు దృష్టికి వచ్చింది. దీంతో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ఇంటర్ బోర్డు.. ఎస్సెస్సీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్‌తో హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించారు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
హాల్ టికెట్ల కోసం www.tsbie.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి.