హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షలను ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్నట్టు బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో మాట్లాడారు. పరీక్షలు, ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాల్లేని కాలేజీలకు ప్రాక్టికల్ సెంటర్లు కేటాయించబోమని తేల్చిచెప్పారు. కాలేజీలే సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్ ఉంటాయని, 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉంటాయని వెల్లడించారు. అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్(ఏసీఈ) గ్రూపు ప్రవేశపెడతున్నామని తెలిపారు. సీఈసీ కోర్సులో సివిక్స్ స్థానంలో అకౌంటెన్సీ చేరుతుందన్నారు. ఎస్సీఈఆర్టీ సహకారంతో పుస్తకాలను డిజిటలీకరించి, క్యూఆర్‌కోడ్ ముద్రిస్తామని తెలిపారు.
ఒక కాలేజీలో చదువు.. మరో కాలేజీలో ప్రాక్టికల్స్
ఒక కాలేజీలో చదువుతున్న విద్యార్థులు తమకు సమీపంలోని మరో కాలేజీలో ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్ చేసుకునే సరికొత్త అవకాశాన్ని కల్పించినట్టు కృష్ణఆదిత్య తెలిపారు. తెలంగాణ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ఈ డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చామని, 1,450 విద్యాసంస్థలు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయని తెలిపారు. విద్యార్థులకు స్లాట్స్ కేటాయించి ప్రాక్టికల్స్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల్లోని వారు ప్రైవేట్‌లో.. ప్రైవేట్ కాలేజీల్లోని వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.