ఖైరతాబాద్, అక్టోబర్ 6: మూసీ సుందరీకరణ పేరుతో 84వేల పేదల ఇండ్లను ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతోనే ఉస్మాన్‌సాగర్ గేట్లను ఎత్తి ప్రభుత్వమే పేదల ఇండ్ల ముంపునకు గురిచేసిందని కాంగ్రెస్ బహిష్కృతనేత బక్క జడ్సన్ ఆరోపించారు. అంతపెద్ద మొత్తంలో ఇండ్లను ఖాళీ చేయిండం సాధ్యం కాదు కాబట్టి, ప్రకృతి వైపరీత్యాన్ని వినియోగించారని విమర్శించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికారులు ఆగస్టులో ఉస్మాన్‌సాగర్‌లో ఒక ఫీటు ఎత్తులో రెండు గేట్లను ఎత్తి 3.6 టీఎంసీలు, ఆ తర్వాత హిమాయత్‌సాగర్ ఒక గేటు ఎత్తి 2.73 టీఎంసీలను వదిలారని చెప్పారు.
కానీ సెప్టెంబర్ 27న 10 గేట్లను ఆరు ఫీట్లకు ఎత్తి 6000 టీఎంసీలు వదిలారని, అదృష్టవశాత్తు ప్రజలకు పెనుముప్పు తప్పిందని తెలిపారు. ఆ రోజు కావాలనే ముంపునకు గురయ్యేలా చేశారని ఆరోపించారు. ఇమ్లిబన్ బస్ డిపోలో వందలాది మంది ప్రయాణికులు దసరా కోసం ఊర్లకు వెళ్లేందుకు ఉన్నారని, ఒక్క ఫీటు వరద పెరిగినా పెను ప్రమాదమే జరిగి ఉండేదని తెలిపారు. పేద ప్రజలను నిర్వాసితులను చేసేందుకే ప్రభు త్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని, హైడ్రా ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని చెప్పారు. సమావేశంలో న్యాయవాది అశోక్ కుమార్, జర్నలిస్ట్ శ్రావ్య పాల్గొన్నారు.