హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు కొత్త వైస్చాన్స్లర్లను ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన సెర్చ్ కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే వర్సిటీ పాలకమండలి నామినిల ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఇందుకు కోసం యుద్ధప్రాతిపదికన వర్సిటీల పాలకమండలి సమావేశాలను నిర్వహిస్తున్నది. పాలమూరు, మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాల పాలకమండలి సమావేశాలను మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ పాలకమండలి సమావేశాలు మంగళవారం జరగనున్నాయి. వీసీల ఎంపిక కోసం దరఖాస్తుల గడువు ఈ నెల 12తో ముగుస్తుంది. వీసీల కోసం ఇప్పటివరకు 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరు రెండు, మూడు వర్సిటీల వీసీ పోస్టులకు దరఖాస్తులు సమర్పించారు. దీంతో దరఖాస్తుల సంఖ్య 30 మించింది.