హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో 17వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఆదివారం 15 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.
సోమవారం నుంచి మంచిర్యాల, మంగళవారం నుంచి మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కూడా చలితీవ్రత పెరుగుతుందని, కనిష్ఠ ఉష్ణోగ్రత 11 డిగ్రీలకు దిగివస్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది. రానున్న రోజుల్లో హైదరాబాద్, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉన్నదని తెలిపింది. రానున్న 24 గంటలపాటు రాష్ట్రంలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై, తెల్లవారుజామున పొగమంచు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.